భారత డేవిస్‌కప్‌ జట్టుకు పాకిస్తాన్‌ వీసా.. 60 ఏళ్లలో ఇదే తొలిసారి

Jan 29,2024 21:45 #India, #Sports, #Tennis

న్యూఢిల్లీ: భారత డేవిస్‌ కప్‌ జట్టుకు పాకిస్తాన్‌ వీసా మంజూరైంది. ఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషనర్‌ కార్యాలయం రోహిత్‌ రాజ్‌పాల్‌ బృందానికి వీసాలు జారీ చేసింది. దాంతో, దాదాపు 60ఏళ్ల తర్వాత డేవిస్‌కప్‌ ఆటగాళ్లు పాకిస్తాన్‌గడ్డపై కాలుమోపనున్నారు. ఫిబ్రవరిలో డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ 1 ప్లే ఆఫ్స్‌ ఆడేందుకు భారత బృందం పాకిస్తాన్‌కు పయనం కానుంది. ఇస్లామాబాద్‌లోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో భారత్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో డేవిస్‌ కప్‌ టై మ్యాచ్‌ జరుగనుంది. అంతకుముందు భారత డేవిస్‌ కప్‌ జట్టు తొలిసారి 1964లో పాక్‌కు వెళ్లింది. ఆ ఏడాది లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4-0తో పాక్‌ను చిత్తు చేసింది. 2019లోకజకిస్థాన్‌ వేదికగా తలపడిన టై మ్యాచ్‌లోనూ భారత్‌ 4-0తో విజేతగా నిలిచింది. దాంతో, 2019లో మాదిరిగానే ఈసారి కూడా తటస్థ వేదికపై టై మ్యాచ్‌ నిర్వహించాలని అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్యను భారత టెన్నిస్‌ సమాఖ్య అధికారులు కోరారు. కానీ, ఐటీఎఫ్‌ సభ్యులు అందుకు అంగీకరించలేదు. దాంతో, ఈసారి భారత జట్టు టై మ్యాచ్‌ కోసం పాక్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన సీనియర్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న పాకిస్తాన్‌కు వెళ్లడం లేదు.

డేవిస్‌ కప్‌ జట్టు: రోహిత్‌ రాజ్‌పాల్‌(కెప్టెన్‌), యుకీ బ్రాంబీ, రామ్‌కుమార్‌ రామనాథన్‌, ఎన్‌.శ్రీరాం బాలాజీ, సాకేత్‌ మైనేని, నికీ కలియండా పూనచ, దిగ్విజరు ఎస్డీ ప్రజ్వల్‌ దేవ్‌(రిజర్వ్‌).

➡️