ipl 2024: టైటిల్‌ కొట్టేదెవరో..?

May 26,2024 08:00 #2024 ipl, #Cricket, #Sports
  • నేడు ఐపిఎల్‌ సీజన్‌-17 ఫైనల్‌
  • రెండో టైటిల్‌పై సన్‌రైజర్స్‌ శ్రీ మూడో టైటిల్‌పై కోల్‌కతా గురి

చెన్నై: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17 చివరి దశకు చేరింది. చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య ఆదివారం టైటిల్‌పోరు జరగనుంది. శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ చెన్నై బీచ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఐపిఎల్‌ ట్రోఫీతో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఐపిఎల్‌ నిర్వాహకులు శనివారం ఐపిల్‌ ట్విటర్‌(ఎక్స్‌)లో పోస్ట్‌ చేశారు. ఐపిఎల్‌ చరిత్రలో అత్యధిక సార్లు ఫైనల్‌ ఆడిన ఆల్‌టైమ్‌ రికార్డు మాత్రం చెన్నైదే. ఆ జట్టు ఏకంగా పది పర్యాయాలు టైటిల్‌ వేటలో నిలవడమే కాకుండా ఐదు ట్రోఫీ లను చేజిక్కించు కుంది. ఇక ముంబయి ఇండియన్స్‌ ఆరుసార్లు ఫైనల్‌కు చేరి ఐదుసార్లు టైటిల్‌ను సాధించింది. గౌతం గంభీర్‌ సారథ్యంలో కోల్‌కతా రెండుసార్లు (2012, 2014) చాంపియన్‌గా నిలిచింది. 2021లో కేకేఆర్‌ పోరాడినా చివరకు చెన్నై గెలుపొందడంతో ట్రోఫీ చేజార్చుకుంది. ఈసారి ఐపిఎల్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండు సార్లు రికార్డు స్కోర్లను నమోదు చేసి ఐపిఎల్‌ చరిత్ర లో పలు సంచలనాలకు తెరలేపింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ జట్టు రాజస్థా న్‌ రాయల్స్‌పై సంచలన విజయంతో మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. 2016లో తొలిసారి టైటిల్‌ను నెగ్గిన సన్‌రైజర్స్‌.. 2018లో ఫైనల్‌ చేరినా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌తో సంతృప్తిపడాల్సి వచ్చింది.
ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 2012, 2014లో టైటిళ్లను నెగ్గి 2021 రన్నరప్‌గా నిలిచింది. ఈసారి లీగ్‌లో కోల్‌కతా 14మ్యాచుల్లో 9మ్యాచుల్లో గెలిచింది. మరో 2మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. కేవలం 3మ్యాచుల్లో మాత్రమే పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో 20పాయింట్లతో మిగతా జట్లకు అందనంత ఎత్తులో నిలిచి అగ్రస్థానంతో క్వాలిఫయర్‌-1కు చేరింది. అదే ప్రదర్శనను క్వాలిఫయర్‌-1లో సన్‌రైజర్స్‌పై చూపింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 160పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.4ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది కోల్‌కతా మాత్రమే. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌తో ఆడి రెండు మ్యాచుల్లోనూ కోల్‌కతా జట్టు ఘన విజయం సాధించింది.
జట్లు…
సన్‌రైజర్స్‌: కమిన్స్‌(కెప్టెన్‌), హెడ్‌, అభిషేక్‌ శర్మ, త్రిపాఠి, మార్‌క్రమ్‌, క్లాసెన్‌(వికెట్‌ కీపర్‌), నితీశ్‌ రెడ్డి, సమద్‌, షాబాజ్‌ అహ్మద్‌/ఫిలిప్స్‌, ఉనాద్కట్‌, భువనేశ్వర్‌, నటరాజన్‌.
కోల్‌కతా: శ్రేయస్‌(కెప్టెన్‌), గుర్బాజ్‌, నరైన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రింకు సింగ్‌, రస్సెల్‌, రమన్‌దీప్‌, స్టార్క్‌, వైభవ్‌, హర్షీత్‌, వరణ్‌ చక్రవర్తి.

➡️