నెంబర్‌ 7 జెర్సీకి రిటైర్మెంట్‌!

Dec 16,2023 16:21 #MS Dhoni, #Sports

భారత జట్టుకు అత్యధిక ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్‌ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం కల్పించింది. ధోనీ జెర్సీ నంబర్‌ 7 రిటైర్‌ అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అంటే ఇక మీదట భారత క్రికెటర్‌ ఎవరూ ఏడో నెంబర్‌ జెర్సీతో బరిలోకి దిగడం కుదరదు. సచిన్‌ టెండుల్కర్‌ తర్వాత ఈ గౌరవం ధోనీకి మాత్రమే దక్కింది. సచిన్‌ రిటైర్మెంట్‌ తరువాత జెర్సీ నంబర్‌ 10 రిటైర్‌ అవుతున్నట్లు గతంలోనే బీసీసీఐ ప్రకటించింది. ఇక ఇప్పుడు ‘జెర్సీ 7’కు ఈ గౌరవం దక్కింది.భారత క్రికెట్‌ జట్టులో బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌గానే కాకుండా.. కెప్టెన్‌గా తనదైన ముద్ర వేశాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ సహా 2013 ఛాంపియన్‌ ట్రోఫీని భారత జట్టుకు ధోనీ అందించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగిన మహీ.. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చాడు. భారత జట్టుకు ఎంతో సేవ చేసిన ధోనీ గౌరవార్థం బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

➡️