కోహ్లి, కార్తీక్‌ ధనాధన్‌.. బెంగళూర్‌ బోణీ

Mar 25,2024 23:45 #2024 ipl, #Cricket, #rcb, #Sports
  • పంజాబ్‌ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు
  • పంజాబ్‌ కింగ్స్‌ 176/6, బెంగళూర్‌ 178/6

బెంగళూర్‌ : రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ బోణీ కొట్టింది. ఐపీఎల్‌ 17 ఆరంభ మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ.. సొంతగడ్డపై బలంగా పుంజుకుంది. 177 పరుగుల ఛేదనను 19.2 ఓవర్లలోనే ముగించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఛేదనలో దినేశ్‌ కార్తీక్‌ (28 నాటౌట్‌, 10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. విరాట్‌ కోహ్లి (77, 49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో బెంగళూర్‌ను గెలుపు పట్టాలపై నడిపించాడు. మహిపాల్‌ లామ్రోర్‌ (17 నాటౌట్‌, 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు నిరాశపరిచారు. విరాట్‌ కోహ్లి ఒక్కడే నిలువగా.. మరో ఎండ్‌ నుంచి సహకారం లభించలేదు. డుప్లెసిస్‌ (3), కామెరూన్‌ గ్రీన్‌ (3), రజత్‌ పటీదార్‌ (18), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (3), అనుజ్‌ రావత్‌ (11) విఫలమయ్యారు. కోహ్లి నిష్క్రమణతో మ్యాచ్‌ పంజాబ్‌ కింగ్స్‌ వైపు మొగ్గింది. కానీ దినేశ్‌ కార్తీక్‌, మహిపాల్‌ లామ్రోర్‌ సూపర్‌ హిట్టింగ్‌ను బెంగళూర్‌కు విజయాన్ని కట్టబెట్టారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (45, 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), జితేశ్‌ శర్మ (27, 20 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), శశాంక్‌ సింగ్‌ (21 నాటౌట్‌, 8 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) రాణించారు. ఈ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు ఇది తొలి విజయం కాగా, పంజాబ్‌ కింగ్స్‌కు ఇది తొలి పరాజయం.

శశాంక్‌ ధనాధన్‌ : సొంతగడ్డపై టాస్‌ నెగ్గిన బెంగళూర్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పంజాబ్‌ కింగ్స్‌కు ఓపెనర్లు మరోసారి ఆశించిన ఆరంభం ఇవ్వలేదు. జానీ బెయిర్‌స్టో (8) నిరాశపరిచాడు. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (45, 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. ప్రభు సిమ్రన్‌ సింగ్‌ (25)తో కలిసి రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించిన ధావన్‌ పంజాబ్‌ కింగ్స్‌కు మంచి స్కోరు అందించేలా కనిపించాడు. అర్థ సెంచరీ ముంగిట ధావన్‌ నిష్క్రమించగా.. లియాం లివింగ్‌స్టోన్‌ (7) ఓ సిక్సర్‌, ఫోర్‌తో సరిపెట్టాడు. 89/4తో పంజాబ్‌ కింగ్స్‌ స్వల్ప స్కోరుకు పరిమితం అయ్యేలా కనిపించింది. ఈ దశలో శామ్‌ కరన్‌ (23), జితేశ్‌ శర్మ (27) విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 34 బంతుల్లో 52 పరుగులు జోడించారు. డెత్‌ ఓవర్లలో కరన్‌, జితేశ్‌ వికెట్‌ కోల్పోగా.. ముగింపు బాధ్యత శశాంక్‌ సింగ్‌ (21 నాటౌట్‌) తీసుకున్నాడు. రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 8 బంతుల్లోనే 21 పరుగులు పిండుకున్నాడు. దీంతో పంజాబ్‌ కింగ్స్‌ 176 పరుగులు చేసింది. బెంగళూర్‌ బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ (2/26), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (2/29) రాణించారు. అల్జారీ జోసెఫ్‌ ఆరంభంలో ఆకట్టుకున్నా.. చివర్లో పరుగుల నియంత్రణ కోల్పోయాడు. యశ్‌ ధయాల్‌ (1/23) సైతం ఆకట్టుకున్నాడు.

సంక్షిప్త స్కోరు వివరాలు :
పంజాబ్‌ కింగ్స్‌ : 176/6 (శిఖర్‌ ధావన్‌ 45, జితేశ్‌ శర్మ 27, మహ్మద్‌ సిరాజ్‌ 2/26, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 2/29)
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ : 178/6 (విరాట్‌ కోహ్లి 77, దినేశ్‌ కార్తీక్‌ 28, కగిసో రబాడ 2/23, హర్‌ప్రీత్‌ 2/13)

➡️