శతక మందాన

Jun 16,2024 23:18 #Sports

-దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం
– రాణించిన ఆశా శోభన, దీప్తి శర్మ
-సఫారీ, భారత మహిళల తొలి వన్డే
బెంగళూరు :దక్షిణాఫ్రికా, భారత మహిళల తొలి వన్డేలో టీమ్‌ ఇండియా ఘన విజయం సాధించింది. సఫారీ అమ్మాయిలపై 143 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం నమోదు చేసింది. స్మృతీ మంధాన (117, 127 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) శతక గర్జన చేసింది. 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెలరేగిన మంధాన దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికారేసింది. దీప్తి శర్మ (37, 48 బంతుల్లో 3 ఫోర్లు), పూజ వస్ట్రాకర్‌ (31, 42 బంతుల్లో 3 ఫోర్లు) లోయర్‌ ఆర్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ షెఫాలీ వర్మ (7), హేమలత (12) సహా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (10), జెమీమా రొడ్రిగస్‌ (17), రిచా ఘోష్‌ (3) విఫలమయ్యారు. ఓ ఎండ్‌లో నిలబడిన స్మృతీ మంధాన ఇన్నింగ్స్‌కు ముందుకు నడిపించింది. మంధాన లోయర్‌ ఆర్డర్‌లో దీప్తి శర్మ, పూజ వస్ట్రాకర్‌లు చక్కటి సహకారం అందించారు. సఫారీ బౌలర్లలో ఆయబోంగ (3/47), క్లాస్‌ (2/51) రాణించారు. ఇక భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా అమ్మాయిలు చేతులెత్తేశారు. లెగ్‌ స్పిన్నర్‌ ఆశా శోభన (4/21) మాయజాలానికి దీప్తి శర్మ (2/10) సైతం తోడైంది. దీంతో 37.4 ఓవర్లలో 122 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌటైంది. సఫారీ బ్యాటర్లలో సునె లస్‌ (33), మారిజానె కాప్‌ (24), జాఫ్టా (27 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. భారత ఓపెనర్‌ స్మృతీ మంధాన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజ వేసింది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్స్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన రెండు పాయింట్లు సైతం ఖాతాలో వేసుకుంది.

➡️