Malaysian Masters: ఫైనల్లో తడబాటు

May 26,2024 21:38 #PV Sindhu, #Sports
  • రన్నరప్‌తో సరిపెట్టిన సింధు

కౌలాలంపూర్‌ (మలేషియా) : భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పి.వి సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ విజయం కోసం ఎదురుచూస్తున్న తెలుగు తేజం.. మలేషియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో ఆఖరు అడుగులో తడబడింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పి.వి సింధు మూడు గేముల పోరాటంలో పరాజయం పాలైంది. సుమారు గంటన్నర పాటు సాగిన టైటిల్‌ పోరులో చైనా షట్లర్‌, రెండో సీడ్‌ జాంగ్‌ జి యు విజయం సాధించింది. 21-16, 5-21, 16-21తో పి.వి సింధు ఓటమి చెందింది. ఫైనల్లో సింధు తొలి గేమ్‌లో దూకుడు చూపించింది. 6-6 వరకు జాంగ్‌ పోటీ ఇచ్చినా.. ఆ తర్వాత సింధు ముందంజ వేసింది. 11-9తో విరామ సమయానికి ముందంజ వేసింది. ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అదే ఊపులో 21-16తో తొలి గేమ్‌లో గెలుపొందింది. కీలక రెండో గేమ్‌లో సింధు చతికిల పడింది. చెలరేగిన జాంగ్‌ 11-3తో విరామ సమయానికి తిరుగులేని ఆధిక్యం సాధించింది. ద్వితీయార్థంలో వరుసగా 9 పాయింట్లు సాధించిన జాంగ్‌ 21-5తో ఏకపక్షంగా రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు పుంజుకుంది. 11-3తో ఎదురులేని ఆధిక్యం దక్కించుకుంది. కానీ విరామ సమయం తర్వాత జాంగ్‌ గొప్పగా పుంజుకుంది. 8-11తో అంతరం కుదించిన జాంగ్‌.. వరుసగా ఏడు పాయింట్లతో 15-13తో ముందంజ వేసింది. ఆధిక్యం చేజార్చుకున్న సింధు మళ్లీ పుంజుకోలేకపోయింది. 21-16తో మూడో గేమ్‌తో పాటు మహిళల సింగిల్స్‌ టైటిల్‌ చైనా షట్లర్‌ సొంతమైంది. పురుషుల సింగిల్స్‌లో విక్టర్‌ అక్సెసెన్‌ (డెన్మార్క్‌), పురుషుల డబుల్స్‌లో డెన్మార్క్‌ జోడీ కిమ్‌, అండర్స్‌లు విజేతలుగా నిలిచారు. మహిళల డబుల్స్‌లో జపాన్‌ జంట టైటల్‌ సాధించగా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మలేషియా షట్లర్లు సూన్‌, జెమీలు చాంపియన్లుగా నిలిచారు.

➡️