టాప్‌లోనే ‘సూర్య’ఐసిసి టి20 ర్యాంకింగ్స్‌ విడుదల

Dec 20,2023 22:20 #Sports

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) తాజా టి20 ర్యాంకింగ్స్‌లో మిస్టర్‌ 360 డిగ్రీస్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ టాప్‌లోనే నిలిచాడు. ఐసిసి బుధవారం విడుదల చేసిన బ్యాటర్స్‌ జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ 887రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. ఆ తర్వాత పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌(787రేటింగ్‌ పాయింట్లు) రెండోస్థానంలో నిలిచాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌(674) 7వ స్థానంలో నిలిచి టాప్‌ా10లో చోటు దక్కించుకున్నాడు. ఇక భారత యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్ బౌలింగ్‌ విభాగంలో 3వ స్థానానికి పడిపోయాడు. టాప్‌లో ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ అదిల్‌ రషీద్‌ ఎగబాకాడు. ఇంగ్లండ్‌ నుంచి టి20 క్రికెట్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న బౌలర్లలో రషీద్‌ రెండో స్పిన్నర్‌ కావడం గమనార్హం. గతంలో గ్రేమ్‌ స్వాన్‌ ఇంగ్లండ్‌ తరఫున టి20లలో తొలి స్థానం దక్కించుకున్న దశాబ్దకాలం తర్వాత మరో స్పిన్నర్‌ ఈ ర్యాంకుకు చేరుకోవడం విశేషం. ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న రషీద్‌.. విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు ఆఫ్ఘన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, భారత యువ స్పిన్నర్‌ రవి బిష్ణోరులను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత జాబితాలో వనిందు హసరంగ, మహీశ్‌ తీక్షణ ఉన్నారు. టాప్‌-5లో ఉన్న బౌలర్లందరూ స్పిన్నర్లే కావడం గమనార్హం. టి20 ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్‌ పాండ్యా 196రేటింగ్‌ పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా.. ఈ విభాగంలో షకీబ్‌-అల్‌-హక్‌(బంగ్లా) 272పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత మహ్మద్‌ నబి(ఆఫ్ఘన్‌) 210పాయింట్లు, ఆడెన్‌ మార్‌క్రమ్‌(దక్షిణాఫ్రికా) 205పాయింట్లతో టాప్‌-3లో ఉన్నారు.

➡️