ఫైనల్‌ బెర్త్‌ ఎవరికో..!

May 24,2024 08:13 #Sports

రేపు సన్‌రైజర్స్‌-రాజస్థాన్‌ క్వాలిఫయర్‌2 మ్యాచ్‌
రాజస్థాన్‌ – 2008 విజేత, 2022 రన్నరప్‌
సన్‌రైజర్స్‌ -2016 విజేత, 2018 రన్నరప్‌
చెన్నై: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇప్పటికే ఫైనల్‌కు చేరగా.. బెంగళూరు జట్టు ప్లా-ఆఫ్‌లో ఓడి 4వ స్థానానికి పరిమితమైంది. మరోవైపు కోల్‌కతా చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, బెంగళూరుపై నెగ్గిన రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య చిదంబరం స్టేడియంలో శుక్రవారం క్వాలిఫయర్‌ా2 మ్యాచ్‌ జరగనుంది.
సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో అద్భుత విజయాలతో ఏకంగా 2వ స్థానంలో నిలిచి ప్లాేఆఫ్‌కు చేరినా.. ఫైనల్‌ బెర్త్‌కోసం జరిగిన పోటీలో కోల్‌కతా చేతిలో ఓడి నేడు మరోదఫా ఫైనల్‌ బెర్త్‌కోసం రాజస్థాన్‌తో పోటీ పడనుంది. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ ఈ సీజన్‌ ప్రారంభంలో వరుస విజయాలతో మెరిసింది. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. అయినా మూడోస్థానంలో నిలిచి ప్లా-ఆఫ్స్‌కు చేరింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్‌1లో రాజస్థాన్‌ జట్టు బెంగళూరును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. సన్‌రైజర్స్‌-రాజస్థాన్‌ జట్లు ఈ సీజన్‌లో ఒక్కసారి మాత్రమే తలపడగా.. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ జట్టు ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.
టాపార్డర్‌ రాణిస్తేనే…
సన్‌రైజర్స్‌ టాపార్డర్‌ బ్యాటర్లు ట్రివిస్‌ హెడ్‌-అభిషేక్‌ శర్మ దుర్భేధ్య ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ తొలి 10ఓవర్లు క్రీజ్‌లో నిలదొక్కుకుంటే స్కోర్‌బోర్డు పరుగు తీయడం ఖాయం. వీరి బ్యాట్‌నుంచి పరుగుల వరద పారడమూ ఖాయమే. హెడ్‌ 13మ్యాచుల్లో ఒక సెంచరీ, 4అర్ధసెంచరీల సాయంతో 533పరుగులు చేయగా.. అభిషేక్‌ శర్మ 14మ్యాచుల్లో 75పరుగుల అత్యధిక స్కోర్‌తో 470పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత క్లాసెన్‌, త్రిపాఠి, షాబాజ్‌ భారీస్కోర్లు చేయగల సమర్థులే.
రాజస్థాన్‌ తక్కువగా అంచనావేయొద్దు: అంబటి
మరోవైపు రాజస్థాన్‌ రాయల్స్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయొద్దని చెన్నై సూపర్‌కింగ్‌ మాజీ ఆటగాడు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, స్పిన్‌ విభాగాల్లో ఆ జట్టు పటిష్టంగా ఉందని, ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. వాళ్లు క్వాలిఫయర్‌ా2కు చేరుకున్న తీరు అద్బుతం. చెన్నై పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలమని, ఈ పిచ్‌పై పరుగులు రాబట్టేందుకు కష్టపడాల్సి వస్తుందన్నాడు. అందుకే బ్యాటింగ్‌పై దృష్టి సారించాలని అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు.
జట్లు(అంచనా)…
సన్‌రైజర్స్‌ : కమిన్స్‌(కెప్టెన్‌), హెడ్‌, అభిషేక్‌ శర్మ, త్రిపాఠి, నితీశ్‌ రెడ్డి, షాబాజ్‌ అహ్మద్‌, క్లాసెన్‌(వికెట్‌ కీపర్‌), అబ్దుల్‌ సమద్‌, సన్వీర్‌ సింగ్‌, భువనేశ్వర్‌, వి.వ్యాషక్‌/నటరాజన్‌.
రాజస్థాన్‌ : సంజు శాంసన్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), జైస్వాల్‌, టామ్‌ కోహ్లెర్‌, రియాన్‌ పరాగ్‌, ధృవ్‌ జురెల్‌, హెట్‌మైర్‌, రువాన్‌ పావెల్‌, అశ్విన్‌, బౌల్ట్‌, ఆవేశ్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ/చాహల్‌.

➡️