సస్పెండ్‌ చేస్తే నాకేంటి ?

Jan 30,2024 11:06 #Sports
  • జాతీయ క్రీడలు నిర్వహిస్తున్న రెజ్లింగ్‌ సమాఖ్య
  • దానిపై ఎప్పుడో వేటు వేసిన క్రీడా శాఖ
  • అయినా … మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న సంజయ్ సింగ్‌

న్యూఢిల్లీ : దేశంలోని మల్లయోధులు అయోమయం, గందరగోళంలో పడిపోయారు. బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ విధేయుడైన సంజరు సింగ్‌ నేతృత్వంలోని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)పై సస్పెన్షన్‌ వేటు పడినప్పటికీ పూనేలో సీనియర్‌ జాతీయ పోటీలు నిర్వహిస్తుండడం ఈ పరిస్థితికి కారణమైంది. అయితే ప్రముఖ క్రీడాకారుల్లో చాలా మంది ఈ పోటీల్లో పాల్గొనడం లేదు. కేంద్ర క్రీడా మంత్రి ఏర్పాటు చేసిన అడ్‌హాక్‌ కమిటీ వచ్చే నెల ప్రారంభంలో జైపూర్‌లో నిర్వహిస్తున్న ‘నేషనల్స్‌’కు వారంతా హాజరవుతున్నారు. బ్రిజ్‌ భూషణ్‌పై కనీసం ఏడుగురు మహిళా మల్లయోధులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదు. బ్రిజ్‌ భూషణ్‌ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతూనే ఉన్నారు. దేశంలోని ప్రముఖ రెజ్లర్లు సుదీర్ఘకాలం నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఆయన్ని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవి నుండి తప్పించారు. బ్రిజ్‌ భూషణ్‌ విధేయుడైన సంజరు సింగ్‌ ఆ పదవికి ఎన్నికవడంతో రెజ్లర్లు మరోసారి ఆందోళన బాట పట్టారు. దీంతో రెజ్లింగ్‌ సమాఖ్యపై క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెన్షన్‌ వేటు వేసింది. సమాఖ్య కార్యకలాపాల పర్యవేక్షణకు అడ్‌హాక్‌ కమిటీని నియమించింది. అయితే తనపై విధించిన సస్పెన్షన్‌ను గుర్తించబోనని సంజరు సింగ్‌ తెగేసి చెబుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అంతటితో ఊరుకోని సంజరు సింగ్‌ పూనేలో సోమవారం నుండి సీనియర్‌ నేషనల్స్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇవి బుధవారం వరకూ కొనసాగుతాయి. అయితే పోటీలు నిర్వహించే వేదిక వద్ద దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. రెజ్లింగ్‌ కేటగిరీల్లో పేరెన్నికగన్న క్రీడాకారులు చాలా మంది అక్కడ కన్పించడం లేదు. గత సంవత్సరం జూలైలో ఆసియా క్రీడల ట్రయల్స్‌లో రవి దహియాను ఓడించిన మహారాష్ట్ర మల్లయోధుడు అతిష్‌ తోడ్కర్‌ ఒక్కడే అక్కడ కన్పించాడు. రైల్వే, సర్వీసెస్‌ జట్లు రంగంలో లేకపోవడంతో పోటీలు కళ తప్పాయి. సంజరు సింగ్‌కు మద్దతుగా 24 రాష్ట్రాలలోని రెజ్లింగ్‌ సమాఖ్యల నుండి మల్లయోధులను పంపేందుకు కొన్ని వర్గాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, అసోం మినహా అనేక రాష్ట్రాల నుండి పూర్తి స్థాయి జట్లు జైపూర్‌ వెళుతున్నాయి. అక్కడ జరిగే నేషనల్స్‌లో పాల్గొంటాయి. వారం రోజుల వ్యవధిలో రెండు పోటీలు జరుగుతుండడంతో మల్లయోధులు అయోమయంలో పడిపోయారు. కొందరు రెండు పోటీలలోనూ పాల్గొంటున్నారు. అయితే స్వల్ప వ్యవధిలో రెండు పోటీల్లో పాల్గొనడం మల్లయోధులకు అంత తేలికైన విషయం కాదు.

➡️