స్టేడియం ఎక్కడ ?

Jan 1,2024 11:33 #Sports
  • పార్క్‌లో భారత్‌ – పాక్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌
  • ఇంకా మొదలవని స్టేడియం నిర్మాణం పనులు
  • మరో ఆరు నెలల్లో 2024 టీ20 ప్రపంచకప్‌

న్యూయార్క్‌ : భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అనగానే క్రికెట్‌ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా స్టేడియం కిక్కిరిసిపోవటంతో పాటు టెలివిజన్‌, డిజటల్‌ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డులు నమోదవుతాయి. ఈ మెగా మ్యాచ్‌కు ఆతిథ్యం అందించే భాగ్యం దక్కటమో పెద్ద విషయం. ఐసీసీ టోర్నీల్లో భాగంగా ఏ దేశంలో భారత్‌, పాక్‌ తలపడినా అత్యుత్తమ సౌకర్యాలు, అత్యధిక సీటింగ్‌ కెపాసిటీ కలిగిన స్టేడియంనే వేదికగా ఎంపిక చేస్తారు. కానీ తొలిసారి అసలు స్టేడియమే లేని చోట భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను షెడ్యూల్‌ చేశారు. అందుకు మరో ఆరు నెలల్లో ఆరంభం కానున్న ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌ వేదిక కానుంది. ఈ విషయం క్రికెట్‌ అభిమానులను కాస్త షాక్‌కు గురి చేసినా.. ఇదే కఠోర వాస్తవం.

ఫిబ్రవరిలో నిర్మాణం మొదలు! : భారత్‌, పాకిస్థాన్‌ టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ న్యూయార్క్‌లో జరుగనుందని ఐసీసీ ఇటీవల షెడ్యూల్‌ ప్రకటిస్తూ.. గొప్పగా ప్రచారం చేసింది. ఇరు దేశాల అభిమానులు సైతం న్యూయార్క్‌లో దాయాదుల ధనాధన్‌పై భారీగా అంచనాలు పెంచుకున్నారు. కానీ తీరా చూస్తే.. అసలు ఈసన్‌హౌవర్‌ పార్క్‌లో ఎటువంటి స్టేడియం లేదు. ప్రస్తుతానికి అక్కడ మార్నింగ్‌, ఈవెనింగ్‌ వాకింగ్‌ చేసేందుకు స్థానికులు వస్తున్నారు. క్రికెట్‌కు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరుగటం లేదు. కనీసం క్రికెట్‌ పిచ్‌ కూడా లేదు. ఇటువంటి చోట భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను షెడ్యూల్‌ చేయటంపై సోషల్‌ మీడియాలో అభిమానులు మండిపడుతున్నారు. ప్రపంచకప్‌కు మరో ఆరు నెలల సమయం ఉంది. ఫిబ్రవరిలో స్టేడియం నిర్మాణం పనులు ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అసలు జరుగుతుందా ? : అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఎంత వేగంగా చేపట్టినా కనీసం 40 నెలల సమయం పడుతుంది. కాన్సెప్ట్‌, డిజైన్‌, కన్‌స్ట్రక్షన్‌లకు కలుపుకుంటే మరింత అధిక సమయం తీసుకుంటుంది. ప్రస్తుతానికి ఈసన్‌హౌవర్‌ పార్క్‌ సాధారణ ఓ ఖాళీ స్థలమని చెప్పవచ్చు!. క్రికెట్‌ పిచ్‌లు రూపొందించటం పెద్ద కష్టం కాదు. కానీ కనీసం 34 వేల మంది కూర్చునేందుకు అనువైన స్టేడియం నిర్మాణానికి కనీస సమయం పడుతుంది. ఈ విషయం ఐసీసీ పెద్దలకు తెలియనిది కాదు. అయినా, స్టేడియం లేని చోట భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు షెడ్యూల్‌ చేసింది. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ సహా బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌ వంటి స్టార్‌ క్రికెటర్లు మరో ఆరు నెలల్లో ఇక్కడే సాధన చేయనున్నారు. నాలుగు నెలల్లో స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తారా? అనే అనుమానం అంతటా నెలకొంది. లేదంటే ఆఖరు క్షణంలో వేదికను ఫ్లోరిడా లేదా కరీబియన్‌ దీవులకు మార్పు చేసేందుకు అవకాశం లేకపోలేదు.

➡️