రోహిత్‌ సేన సాధించేనా.. నేడు దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌

Dec 26,2023 10:44 #Cricket, #Sports, #test match
  •  కోహ్లి, రోహిత్‌ చేరిక
  •  పేసర్లకు స్వర్గధామం
  • మధ్యాహ్నం 1.30గం||లకు

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు ఇప్పటికే టి20, వన్డేల సిరీస్‌లను చేజిక్కించుకున్న హుషారులో ఉంది. అదే ఊపుతో టెస్టుల్లోనూ బరిలోకి దిగుతోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు వేర్వేరు జట్లను పంపిన బిసిసిఐ వ్యూహం ఫలించింది. యువ క్రికెటర్లతో కూడిన టీమిండియా టి20 సిరీస్‌ను 2-1తో, సీనియర్‌, యువ క్రికెటర్లతో కూడిన టీమిండియా వన్డే సిరీస్‌నూ 2-1తో చేజిక్కించుకుంఇ. ఇక టెస్టుల్లో సీనియర్లందరూ చోటు దక్కించుకొని రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. వన్డే ప్రపంచకప్‌ తర్వాత రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి తొలిసారి బ్యాట్‌లు పట్టనున్నారు. దక్షిణాఫ్రికా గడ్డపై భారత పురుషుల జట్టు ఇప్పటివరకు టెస్ట్‌ సిరీస్‌ను గెలిచిన దాఖలాలు లేవు. ఈ గడ్డపై ఇప్పటివరకు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు మాత్రమే సఫారీ జట్టు సిరీస్‌ను సాధించాయి. దీంతో భారత్‌కు ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న సఫారీ గడ్డపై సిరీస్‌ను చేజిక్కించుకోవాలన్న దృఢ నిశ్చయంతో బరిలోకి దిగుతోంది. ఇక్కడి పిచ్‌లో పేస్‌కు అనుకూలిస్తాయి కాబట్టి నలుగురు పేసర్లతో బరిలోకి దిగినా ఆశ్చర్యపోన్నక్కర్లేదు. దక్షిణాఫ్రికా గడ్డపై 23 టెస్టులాడిన టీమిండియా కేవలం నాలుగింట్లో మాత్రమే విజయం సాధించింది. గతంలో సఫారీ పర్యటనకు మహ్మద్‌ షమీ 43.83సగటుతో ఆరు వికెట్లు తీసాడు. ఈసారి చీలమండ గాయం కారణంగా షమీ ఈ సిరీస్‌కు దూరం కావడం పెద్ద లోటే.

ఇక దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. ఈ సిరీస్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు పలుకుతున్నట్లు స్టార్‌ బ్యాటర్‌ డీన్‌ ఎల్గర్‌ ఇప్పటికే ప్రకటించాడు. దీంతో ఈ సిరీస్‌ చేజారకుండా అతడిని గౌరవంగా సాగనంపాలన్న దృఢనిశ్చయంతో దక్షిణాఫ్రికా జట్టు ఉంది. అలాగే చీలమండ గాయం నుంచి కగిసో రబడా కోలుకొని తిరిగి జట్టులో చేరాడు. దీంతో సఫారీ జట్టు బౌలింగ్‌ విభాగం పటిష్టంగా తయారైంది. అనుభజ్ఞుడైన రబడా సొంతగడ్డపై చెలరేగడం ఖాయం. వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికాజట్టు కెప్టెన్‌గా ఉన్న బవుమా వన్డే, టి20ల్లో చోటు దక్కించుకోలేకపోయినా.. తిరిగి టెస్టుల్లో పగ్గాలు అందుకున్నాడు. అన్ని విభాగాల్లో దక్షిణాఫ్రికా ఫీల్డర్లు రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. మెరుగైన రికార్డుతో కోహ్లి…సఫారీ గడ్డపై మెరుగైన బ్యాటింగ్‌ రికార్డు ఉంది ఒక్క విరాట్‌ కోహ్లికి మాత్రమే. అతడు ఆ జట్టుపై 49.29సగటును కలిగి ఉన్నాడు. ఇక రోహిత్‌ శర్మ 46.54సగటు కలిగి ఉన్నా ఇక్కడ క్రీజ్‌లో నిలదొక్కుకోవడం కష్టమే. శుభ్‌మన్‌ గిల్‌, జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌లకు ఇదే తొలి దక్షిణాఫ్రికా సిరీస్‌.

జట్లు..

భారత్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, బుమ్రా, ప్రసిధ్‌ కృష్ణ/అశ్విన్‌.

దక్షిణాఫ్రికా : బవుమా(కెప్టెన్‌), ఎల్గర్‌, మార్‌క్రమ్‌, జోర్జి, బెర్గిగ్హామ్‌, వెర్రియనే, జాన్సెన్‌, కేశమ్‌ మహరాజ్‌, కొర్ట్జి, రబడా, ఎన్గిడి.

➡️