వైద్యులు దేవుళ్లతో సమానం: బూచేపల్లి

ప్రజాశక్తి-చీమకుర్తి: వైద్య వృత్తి మహౌన్నతమైనదని జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. జాతీయ డాక్టర్స్‌డే సందర్భంగా జవహర్‌ నర్సింగ్‌ హౌం, లయన్స్‌ క్లబ్‌, జెవివిల ఆధ్వర్యంలో స్థానిక జె అండ్‌ ఎం ఫంక్షన్‌ హాలులో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన డాక్టర్‌ బందా జవహర్‌ వైద్య సేవా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సభకు డాక్టర్‌ బి రాకేష్‌ అధ్యక్షత వహించారు. బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలు అందిస్తూ ప్రజాసేవ చేస్తున్న డాక్టర్‌ బందా జవహర్‌ అభినందనీయులన్నారు. పేదల వైద్యునిగా ప్రఖ్యాతిగాంచిన జవహర్‌ను ఆదర్శంగా తీసుకొని సేవలందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జవహర్‌ మాట్లాడుతూ రావినూతల గ్రామంలో గత 53 ఏళ్లుగా గ్రామీణ వైద్యునిగా సేవలందిస్తున్న డాక్టర్‌ ఈడ్పుగంటి హృదయరాజును పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతి ఏడాది డాక్టర్స్‌ డే సందర్భంగా పురస్కారం అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా రూ.లక్ష విలువ చేసే వెండి పురస్కారం డాక్టర్‌ హృదయరాజుకు అందజేశారు. ప్రశంసాపత్రం అందజేకసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ వైస్‌ గవర్నర్‌ ఆర్‌ లక్ష్మినారాయణ, మాజీ గవర్నర్‌ పి విజయకుమారరెడ్డి, డాక్టర్‌ మణిమాల, డాక్టర్‌ విద్యాశంకర్‌, డాక్టర్‌ బి రాకేష్‌, డాక్టర్‌ బి శారద, డాక్టర్‌ ఉషారాణి, లయన్స్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు నూనె హేమసుందరరావు, ఎస్‌ అంజిరెడ్డి, చలువాది పార్థసారథి, చలువాది బదరీ నారాయణ, జెవివి జిల్లా కార్యదర్శి జయప్రకాష్‌, డివిజన్‌ కార్యదర్శి చలువాది రమేష్‌, మండల అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, ఫాక్టరీ ఓనర్సు అసోసియేషన్‌ అధ్యక్షులు సిహెచ్‌ మస్తాన్‌రెడ్డి, యూటిఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌కె అక్బర్‌, చలువాది శ్రీను, సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, పూసపాటి వెంకటరావు, టి రామారావు, ఎపిటిఎఫ్‌ నాయకులు జెయాకోబు, వైద్యులు పాల్గొన్నారు.

➡️