అందరి లక్ష్యం ప్రజా సేవే: ఉగ్ర

ప్రజాశక్తి-వెలిగండ్ల: తాను ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని, అధికారులు కూడా అదే మార్గంలో పనిచేయాలని, అలా కాకుండా రైతులు, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా పనిచేస్తే ఉపేంక్షించేది లేదని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి హెచ్చరించారు. ఆరుగాలం కష్టపడి పనిచేసి పట్టెడన్నం పెట్టే రైతు వద్ద ట్రాన్సఫార్మర్‌ బిగించడానికి 25 వేల రూపాయలు లంచం అడగడమేమిటని విద్యుత్‌ ఎఇ రసూల్‌ను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి నిలదీశారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ రమణ మహాలక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చందలూరుపాడు గ్రామానికి చెందిన రైతు నర్సారెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చడానికి 25వేల రూపాయలు లంచం అడుగుతున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అలాగే పిఎన్‌ వరం, రాళ్లపల్లి గ్రామాలకు చెందిన రైతులు సమస్య వచ్చినప్పుడు ఫోన్‌ చేస్తే విద్యుత్‌ అధికారులు ఫోను ఎత్తరని, గత మూడు రోజులుగా మా గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. తక్షణం చర్యలు చేపట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే విద్యుత్‌ ఎఇకి సూచించారు. వైద్యులు, విద్యుత్‌ శాఖ, పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ప్రజల సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అలా చేయని వారు ఉంటే ఇక్కడ నుంచి వెళ్లిపోవచ్చని తెలిపారు. మండలంలో పనిచేసే అన్ని శాఖల ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుంటక తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పిటిసి రామన తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ చిలకల వెంకటేశ్వరరెడ్డి, ఎంపీడీవో సిహెచ్‌ రామచంద్రరావు, తహశీల్దారు డానియల్‌, ఈవోపీఆర్‌డి తాతపూడి సుకుమార్‌, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

➡️