స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద అంతా కట్టుదిట్టంఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద అంతా కట్టుదిట్టంఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద అంతా కట్టుదిట్టంఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌ ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌:ఈవిఎం, కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వివి ప్యాట్‌లు భద్రపరచిన శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లను శనివారం తిరుపతి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బ్యారికేడింగ్‌ తదితర అంశాలపై సిబ్బందికి తగిన సూచనలు సలహాలు, ఆదేశాలు జారీ చేశారు. సెక్యూరిటీ వద్ద సంబంధిత సందర్శకుల రిజిష్టర్‌లో కలెక్టర్‌ సంతకాలు చేశారు. అనంతరం కలెక్టర్‌ స్ట్రాంగ్‌ రూము పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లలో అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. బ్యారికెడింగ్‌ ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటుతో, సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం ఉండాలని, తగినంత సిబ్బందిని సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు విధులు కేటాయించి పర్యవేక్షించాలని ఆదేశించారు. మీడియాతో కలెక్టర్‌ మాట్లాడుతూ స్ట్రాంగ్‌ రూము వద్ద భద్రత ఏర్పాట్లు 11వ తేదీ నుండి 200 మీటర్లు నుండి రాష్ట్ర పోలీస్‌ బలగాలు, 100 మీటర్లలో రాష్ట్ర సాయుధ బలగాలు, స్ట్రాంగ్‌ రూము వద్ద సిఎపిఎఫ్‌ ఏర్పాటు చేసి భద్రత ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. పోలింగ్‌ నాడు, మరుసటి దినం జరిగిన సంఘటనల నేపథ్యంలో ఐదంచెల భద్రత ఏర్పాట్లు చేశామని, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎంట్రన్స్‌, రోడ్‌ పాయింట్‌ వద్ద నుండి సరైన ధ్రువపత్రాలు ఉంటేనే పంపుతున్నారని తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్‌ అమలులో ఉందని తెలిపారు. 6 గార్డ్‌ పాయింట్‌లు స్ట్రాంగ్‌ రూము పరిధిలో ఏర్పాటు చేసి నిరంతర గస్తీ నిఘా ఉంటుందని తెలిపారు. సిఎపీఎఫ్‌, రాష్ట్ర సాయుధ బలగాలు, సివిల్‌ పోలీసులు కలిపి సుమారు 160మంది పోలీస్‌ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందనీ తెలిపారు. యూనివర్సిటీ కాంపౌండ్‌లో స్ట్రాంగ్‌ రూం వద్ద కట్టుదిట్టమైన 3 లేయర్‌ బ్యారికేడింగ్‌ ఏర్పాటు చేశామని, తిరుపతి పార్లమెంటరీ, 7 అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్‌ రూములలో ఈవిఎంల భద్రతపై, అలాగే పరిసర ప్రాంతాల నిఘా కొరకు స్ట్రాంగ్‌ రూం పరిసరాల చుట్టూ నాలుగు దిక్కులా సుమారు 96 సీసీ కెమెరాల ఏర్పాటుతో స్ట్రాంగ్‌ రూమ్‌ల పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఎన్నికల పోటీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించేందుకు వీలుగా ఏర్పాటు చేశామని అన్నారు. ఈవిఎంలు, వివిప్యాట్‌ల భద్రత అంశంలో ఎలాంటి సందేహాలు, అపోహలు అవసరం లేదని అత్యంత పారదర్శకంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. నూతన ఎస్పీ విధుల్లో చేరాక సెక్షన్‌ 144 అమలు ఎన్ని రోజులు కొనసాగించాలని, ఇతర భద్రత అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని తగుచర్యలు తీసుకుని సురక్షిత వాతావరణంలో కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కాలంలో పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై అధనపు సూచనలు చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏదైనా సంఘటనకు స్పందించే క్రమంలో ప్రజలు, మీడియా, సంయమనం పాటించడం అత్యంత కీలకమన్నారు. ఈ విషయంలో ప్రతిఒక్కరూ బాధ్యతతో వ్యహరించాలని, ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భంలో సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఎలాంటి కల్పితాలు, ఫేక్‌ న్యూస్‌ ప్రచారం జరగకుండా చూడాలని కోరారు. ఏదైనా సందేహాలుంటే జిల్లా ఎన్నికల అధికారికి, జిల్లా ఎస్పీలను సంప్రదించి వివరణ తీసుకోవాలని కోరారు. కలెక్టర్‌ వెంట అదనపు ఎస్పీ శ్రీనివాస రావు, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్‌, చంద్రగిరి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి నిషాంత్‌రెడ్డి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, పోలీస్‌ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️