నెమలిగుండ్ల ఆలయంలో ‘ముత్తుముల’

ప్రజాశక్తి-రాచర్ల: రాచర్ల మండలం జెపి చెరువు గ్రామ సమీపాన నల్లమల అడవుల్లో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామిని శనివారం గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి దర్శించారు. ఆలయ కార్యిర్వహణాధికారి బి రమేష్‌, సిబ్బంది రాజేశ్వరరావు, అర్చకులు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో రమేష్‌ అర్చకులు స్వామివారి ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆలయ అభివృద్ధి ప్రణాళికను పరిశీలించి, పనులు ప్రారంభించేందుకు త్వరలోనే చర్యలు చేపడతానని అన్నారు. ఆలయంలో చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆలయ సిబ్బందికి సూచించారు. స్వామి వారి దయతోనే ఎమ్మెల్యే పదవి లభించిందని అన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు త్వరలో ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఆలయ ప్రాంగణంలోని అన్నదాన సత్రాలను సందర్శించి వారి యోగక్షేమాలు, నిర్వహణలు గురించి ఆరా తీశారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా ఆలయానికి వచ్చిన అశోక్‌రెడ్డికి జెపిచెరువు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గిద్దలూరు మున్సిపల్‌ కౌన్సిలర్‌ బోనబోయిన చంద్రశేఖర్‌ యాదవ్‌, టిడిపి నాయకులు ఉలాపు బాలచెన్నయ్య, దుత్తా బాల ఈశ్వరయ్యల ఆధ్వర్యంలో గిద్దలూరు నుంచి నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం వరకు టిడిపి శ్రేణులు పాద యాత్రగా చేరి, ఎమ్మెల్యేతో పాటు వీరు మొక్కు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే వెంట రాచర్ల మండల టిడిపి అధ్యక్షులు కటికె యోగానంద్‌, ఎంపిటిసి జెట్టి వెంకటేశ్వర్లు, సిద్ధం నరసింహులు, కన్నసాని గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️