అంగనవాడీల సమ్మె ఉదృతం

Dec 17,2023 23:43

బాపట్లలో ఆకులు తింటూ నిరసన
– చీరాలలో చిన్నారులతో జగన్‌ మామయ్యకు అభ్యర్ధన
ప్రజాశక్తి – బాపట్ల
ఆకులు తింటూ అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా సమ్మలో నిరసన తెపారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద చేపట్టిన అంగన్వాడీల సమ్మె ఆదివారానికి 6వ రోజుకు చేరింది. తమ జీతాలు పెంచండి బాబోయ్ అంటూ ఆకులు తింటూ అంగన్వాడీలు నినాదాలు చేశారు. యూనియన్‌ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు శైలశ్రీ మాట్లాడుతూ మహిళలనే కనికరం లేకుండా ఆడవాళ్ళని రోడ్డుమీద ఇబ్బంది పెట్టినందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడి కార్యకర్తలకు సిఎం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. కానిపక్షంలో రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు, ఉద్యోగ, కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయటానికి వెనుకాడ బోమని హెచ్చరించారు. రానున్నరోజుల్లో జరిగే ఉద్యమాలకు, సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొడతాం, వేరే వాళ్ళకి తమ విధులు అప్పగిస్తామని ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమైన చర్యని అన్నారు. అరవై రోజులైనా సమ్మె కొనసాగిస్తామని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్ మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే సమ్మె ఉధృతం చేయాలనే నిర్ణయానికి వచ్చామని అన్నారు. మహిళలను గౌరవించే ప్రభుత్వమని చెప్పుకునే జగన్మోహన్‌రెడ్డి కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. అంగన్వాడీల సమ్మెకు యుటిఎఫ్ నాయకులు మద్దతు ప్రకటించారు.


కారంచేడు : అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న సమ్మె 6వ రోజుకు చేరింది. ఆదివారం సెలవు రోజైనప్పటికీ తహశీల్దారు కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు. సిఐటియు నాయకులు పి కొండయ్య మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నించాలని కోరారు. సిఎం జగన్‌ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసి సమ్మె పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో లబ్దిదారులైన నూతలపాడు భూలక్ష్మి, కంచర్ల కౌసల్య, ఉదయగిరి సుభాషిని, లక్ష్మి పిల్లలతో పాటు యూనియన్ నాయకులు ప్రాజెక్టు కార్యదర్శి జి అనిత, ఎస్ఆర్ రాణి, జీ రాణి, బి రాధా పాల్గొన్నారు.


చీరాల : జగన్ మామయ్య మా టీచర్ల జీతాలు పెంచాలి. అంటూ అంగన్వాడీ కేంద్రాల చిన్నారులు తమ టీచర్లు చేస్తున్న సమ్మెలో పలకలపై అభ్యర్ధనను ప్రదర్శించారు. తమ టీచర్లే తమకు కావాలని, అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టవద్దు అంటూ పలకలపై రాసుకొని నిరసన తెలిపారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్వాడీల దీక్షలు 6వ రోజుకు చేరాయి. అంగన్వాడీ కార్యకర్తలకు విద్యార్థులు, విద్యార్థుల తల్లి దండ్రులు నిరసన దీక్షకు మద్దతు తెలిపారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ ఎలిజిబెత్ మాట్లాడుతూ అంగనవాడి కార్యకర్తలు శాంతియుతంగా నిరసన చేస్తుంటే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టడం ఏమిటని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ డిమాండ్స్‌ పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను విద్యార్థులు, విద్యార్థుల తల్లి దండ్రులు, ప్రజలు, పార్టీ నేతలు అందరూ గమనిస్తూ మద్దతుగా నిలిచారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుందని అన్నారు. తమ డిమాండ్స్ పరిష్కారం అయ్యేవరకు సమ్మెని చేస్తామన్నారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు, ఎన్ బాబురావు, జి సుజీవన, జ్యోతి, అరుణ, ప్రసన్న కుమారి, లత, సులోచన పాల్గొన్నారు.


కొల్లూరు : 6వ రోజు అంగన్వాడి కార్యకర్తలు కనీస వేతనాలు పెంపుదల చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని సమ్మె కొనసాగించారు. రోడ్లు వెంబడి వస్తూపోతున్న ప్రజలకు, బస్సులు, ఇతర వాహనాలు ఆపి పువ్వులు ఇచ్చి వి నూత్నంగా నిరసన తెలిపారు.
భట్టిప్రోలు : అంగన్వాడీల కోర్కెలు పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 6వ రోజుకు చేరింది. మండల కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు వినూత్న రీతిలో పాటలతో కవాతు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ విద్యార్థులు జగన్ మామయ్య మా టీచర్లు, ఆయాలకు జీతాలు పెంచు మామయ్య అంటూ పలకలపై వ్రాసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం సత్యనారాయణ, అంగన్వాడీ యూనియన్ మండల అధ్యక్షులు రమాదేవి పాల్గొన్నారు.

రేపల్లె : అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె ఆదివారం కొనసాగించారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నపిల్లల దేవాలయాలని, అలాంటి కేంద్రాల తాళాలు పగలగొట్టారని అన్నారు. ధర్నా శిభిరం వద్దకు లబ్ధిదారులు వచ్చి మద్దతు తెలిపారు. ప్రీస్కూల్‌గా అంగన్‌వాడీ కేంద్రాలు నడిపేందుకు యాప్‌లు ఆటంకంగా ఉన్నాయని అన్నారు. ప్రీ స్కూల్ నిర్వహించాలంటే అదనపు బాధ్యతలు తగ్గించాలని అన్నారు. లబ్ధిదారులకు ఆవసరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. తాము పనిచేస్తున్న దానికి తగిన వేతనం ఇవ్వాలని అడుగుతున్నట్లు చెప్పారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ అంగన్‌వాడీలపై బెందిరింపులుకు పాల్పడటం మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో లబ్ధిదారులు, అంగన్వాడీ వర్కర్స్,హెల్పర్స్ డి జ్యోతి, ఎన్ కృష్ణకుమారి, నాగమణి, వెంకటేశ్వరమ్మ, రజిని, వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.
చెవిలో పువ్వు క్యాలీఫ్లవర్ తో నిరసన
చుండూరు : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అవడమేగాక కేంద్రాలను పొలుగు, గొడ్డళ్లతో పగలగొట్టించటం సరైనది కాదని సిఐటియు నాయకులు బొనిగల ఆగస్టిన్ అన్నారు. తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడిల నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరింది. అంగనవాడీలు చెవిలో క్యాలీఫ్లవర్‌లను పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అగస్టీన్ మాట్లాడుతూ ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరిపితే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. డిమాండ్స్‌ పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రత్నకుమారి, కామేశ్వరి, సుజాత, సరళ, రాణి పాల్గొన్నారు.
ఉరి తాళ్లతో అంగన్వాడీల నిరసన
చెరుకుపల్లి : అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మనిలాల్ అన్నారు. అతి తక్కువ వేతనంతో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బెదిరింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. ఆరవ రోజున ఉరితాళ్ళతో నిరసన తెలిపారు.

➡️