తక్షణమే కాల్పుల విరమణ

– ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి గుటెరస్‌ పిలుపు
– గాజా సరిహద్దుల్లో పర్యటన
గాజా : గాజాతో ఈజిప్ట్‌కు గల సరిహద్దుల్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ శనివారం పర్యటించారు. గత ఐదు మాసాలకు పైగా యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజా ప్రజలకు ఉపశమనం కలిగించేలా కాల్పుల విరమణ తక్షణమే జరగాలని ఆయన పిలుపిచ్చారు. దక్షిణ గాజా నగరమైన రఫాలో సైనిక ఆపరేషన్‌ చేపడతామంటూ ఇజ్రాయిల్‌ బెదిరిస్తున్న నేపథ్యంలో గుటెరస్‌ పర్యటన జరుగుతోంది. ఇటువంటి దాడులు వద్దంటూ అంతర్జాతీయంగా విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ ఇజ్రాయిల్‌ వాటిని బేఖాతరు చేస్తోంది. గాజాలోని 23 లక్షల మంది ప్రజల్లో మెజారిటీ భాగం రాఫా చుట్టుపక్కలనే ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తర గాజాలో అక్కడి ప్రజల ఆకలి కేకలతో పరిస్థితులు మరింత దయనీయంగా వున్నాయి. ఈజిప్ట్‌లోని ఉత్తర సినారు ప్రాంతంలో అల్‌ అరిష్‌ వద్దకు గుటెరస్‌ శనివారం చేరుకున్నారు. ఈ ప్రాంతంలోనే అంతర్జాతీయ సాయం పెద్ద మొత్తంలో పేరుకపోయి వుంది. ప్రాంతీయ గవర్నర్‌ మహ్మద్‌ సుషా యుఎన్‌ చీఫ్‌కు స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ, గాజా ప్రజలకు సాయమందించడానికి ఉత్తర సినారులో దాదాపు 7వేల ట్రక్కులు వేచి చూస్తున్నాయని చెప్పారు. కానీ ఇజ్రాయిల్‌ డిమాండ్‌ చేస్తున్న విధంగా సోదాలు, తనిఖీలతో సాయం అందాల్సిన వారికి అందకుండా నిలిచిపోయిందని అన్నారు. ఈ మేరకు సుషా కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. గాజా నుండి పారిపోయిన పాలస్తీనియన్లు చికిత్స పొందుతున్న అల్‌ అరిష్‌ ఆస్పత్రిని కూడా గుటెరస్‌ సందర్శించనున్నారు. రంజాన్‌ మాసంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని అందరూ ఆశించినా అది జరగలేదు. దాంతో గాజాలో మానవతా పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా, కతార్‌ సహా పలు దేశాలు విమానాల ద్వారా ఆహారాన్ని జారవిడుస్తున్నాయి.

➡️