మాస్కో ఉగ్రదాడి ఉక్రెయిన్‌ పనే – రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వెల్లడి

Mar 24,2024 00:25 #Russian President Putin, #speech

– 143కు చేరిన మృతుల సంఖ్య
మాస్కో : రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్‌ సిటీ హాల్‌లో శుక్రవారం జరిగిన ఉగ్రవాద దాడి వెనుక ఉక్రెయిన్‌ ప్రమేయముందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. ఉగ్రవాద దాడి నేపథ్యంలో శనివారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. మాస్కొలోనూ, మాస్కో పరిసర ప్రాంతాల్లోనూ అదనంగా తీవ్రవాద నిరోధక చర్యలు చేపట్టామని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని కోరారు. ఈ దాడికి పాల్పడిన నలుగురితో సహా మొత్తంగా 11 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వీరిలో నలుగురు ఉక్రెయిన్‌లోకి పారిపోయేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసినట్లు వెల్లడైందని, దీనితో ఉక్రెయిన్‌ హస్తం బయటపడిందని పుతిన్‌ చెప్పారు. తీవ్రవాదులకు ఆయుధాలు ఎవరు అందచేశారు, వారికి వాహనాలు ఎవరు సమకూర్చారు, తప్పించుకుని పోయే మార్గాలను ఎవరు సిద్ధం చేశారు వంటి వివరాలను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారని పుతిన్‌ తెలిపారు.
133కు చేరిన మృతుల సంఖ్య
మాస్కోలో జరిగిన ఉగ్రవాద దాడిలో మృతుల సంఖ్య 133కి చేరిందని,150 మంది పైగా గాయపడ్డారని దర్యాప్తు కమిటీ అధికారులు శనివారం తెలిపారు. ఈ దాడి కారణంగా తలెత్తిన మంటలతో దగ్ధమైన భవన శిధిలాల నుండి మరిన్ని మృతదేహాలను అత్యవసర సహాయ బృందాలు వెలికితీస్తున్నాయని చెప్పారు. దాడి జరిగిన వెంటనే అనుమానితులు సంఘటనా స్థలం నుండి పారిపోయారని, అయితే లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వారిని సరిహద్దుల్లో పట్టుకున్నారని పేర్కొన్నారు. కాగా ఈ దాడికి తమదే బాధ్యత అని ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు ప్రకటించింది. అసాల్ట్‌ రైఫిళ్ళతో వచ్చిన నలుగురు అనుమానితులు శుక్రవారం సాయంత్రం కచేరి జరగడానికి ముందుగా వేదిక వద్దకు దూసుకువెళ్ళారు. పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చారు. తర్వాత గ్రెనెడ్లు విసిరారు. ఆ వెంటనే భవనంలో మంటలు, నల్లని దట్టమైన పొగ కమ్ముకున్న వీడియోలు బయటకు వచ్చాయి. మంటలను అదుపు చేయడానికి మూడు హెలికాప్టర్లను ఉపయోగించారు.

➡️