ఇజ్రాయిల్‌ వార్‌ కేబినెట్‌ రద్దు

Jun 18,2024 02:11 #Dissolution, #Israel's, #War Cabinet
  • కొనసాగుతున్న దాడుల్లో డజన్ల సంఖ్యలో మృతి

జెరూసలేం : గాజాలో దాడులను పర్యవేక్షించే వార్‌ కేబినెట్‌ను ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు రద్దు చేశారు. ఈ కేబినెట్‌లో కీలక సభ్యుడు రిటైర్డ్‌ జనరల్‌ బెనీ గాంట్జ్‌ , మరి కొందరు రాజీనామా చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు మీడియా వార్తలు తెలిపాయి. ఆదివారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో నెతన్యాహు ఈ విషయాన్ని ప్రకటించినట్లు తెలిసింది. మాజీ రక్షణ మంత్రి అయిన గాంట్జ్‌ పోర్టుఫోలియో లేని మంత్రిగా వార్‌ కేబినెట్‌లో ఉన్నారు. నెతన్యాహు విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల ఆరంభంలో ఆయన రాజీనామా చేశారు. ఆ వెంటనే, మరో మంత్రి, మాజీ ఐడిఎఫ్‌ చీఫ్‌ గాది ఇసెన్‌కట్‌ కూడా కేబినెట్‌కు రాజీనామా చేశారు. ఆ వెంటనే పార్లమెంట్‌ సభ్యుడు ట్రాపర్‌ కూడా వైదొలగుతున్నట్లు ప్రకటించారు. గాజాలో యుద్ధానికి ఒక వ్యూహాన్ని రూపొందించడంలో నెతన్యాహు విఫలమవడమే ఈ రాజీనామాలకు కారణమని వారు తెలిపారు. వార్‌ కేబినెట్‌ను కాకుండా మొత్తంగా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రతిపక్ష నేత యాసిర్‌ లాపిడ్‌ వ్యాఖ్యానించారు. బందీల విడుదలకై హమాస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని లేదా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఆగని ఇజ్రాయిల్‌ దాడులు
ఐదుగురు పిల్లలసహా డజన్ల సంఖ్యలో పాలస్తీనియన్ల మృతి
సెంట్రల్‌, దక్షిణ గాజాలో గత 24గంటల్లో ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో ఐదుగురు పిల్లలతో సహా డజన్ల సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారు. రఫాలో భీకరంగా దాడులు కొనసాగుతునే వున్నాయి. నగరవ్యాప్తంగా ఇళ్లు, మౌలిక వసతుల విధ్వంసం కొనసాగుతోంది. గాజా సహాయ కారిడార్‌ పొడవునా వ్యూహాత్మకమైన రీతిలో విరామాలను ప్రకటిస్తామని మిలటరీ ప్రకటించినప్పటికీ వాస్తవిక పరిస్థితులు భిన్నంగా వున్నాయని యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ చీఫ్‌ ఫిలిప్‌ లాజారిని ప్రకటించారు. మానవతా సాయాన్ని నిలిపివేయడం ద్వారా కృత్రిమంగా కరువును సృష్టించి దాన్ని గాజాలో తన రాజకీయ లక్ష్యాలను సాధించుకునేందుకు ఒక సాధనంగా ఇజ్రాయిల్‌ ఉపయోగిస్తోందని పాలస్తీనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పాలస్తీనాను గుర్తించిన దేశాలపై, పాలస్తీనా అథారిటీ (పిఎ)పై ఆంక్షలు విధించాలని ఇజ్రాయిల్‌ ప్రభుత్వం యోచిస్తోంది.

➡️