Ela Gandhi : విద్వేషం, శతృత్వం, హింస ఏ మత బోధనల్లోనూ భాగం కాదు

జొహెన్స్‌ బర్గ్‌ :    విద్వేషం, శతృత్వం, హింస ఏ మత బోధనలలోనూ భాగం కాదని మహాత్మాగాంధీ మనవరాలు, దక్షిణాఫ్రికా శాంతి కార్యకర్త ఎలా గాంధీ పేర్కొన్నారు. మతం పేరుతో ఈ చర్యలను ప్రోత్సహించే హిందూ విశ్వాసాలను వ్యక్తిగత కారణాలతో తప్పుగా విశ్లేషిస్తున్నారని, అలాంటి వారికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. విభజనలు, విద్వేషాలను రెచ్చగొట్టే అటువంటి శక్తులను ప్రతిఘటించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ చర్యలు హిందూ ముస్లింల మధ్య విభజనలను సృష్టించడంతో పాటు గాంధీజీని, తనను హిందూ కమ్యూనిటీ నుండి వేరుచేయడానికి చేసే ప్రయత్నమని ఎలా గాంధీ పేర్కొన్నారు.

ఫీనిక్స్‌ సెటిల్‌మెంట్‌ దర్బాన్‌లో  నిర్వహించిన సర్వమత  సమావేశంలో గాంధీ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫీనిక్స్‌ సెటిల్‌మెంట్‌ ట్రస్ట్‌ ఉద్దేశపూర్వకంగా హిందూ ప్రార్థనలను విడిచిపెట్టిందన్న సోషల్‌మీడియా పోస్టులపై ఆమె పైవిధంగా స్పందించారు. దర్బన్‌, జోహెన్స్ బర్గ్‌లోని టోల్స్‌టాయ్‌లలో  మొట్టమొదటి సారిగా మహాత్మా గాంధీ  ఈ సమావేశాలను  ప్రారంభించారు.  అప్పటి నుండి ప్రతి ఏడాది నిరవధికంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.    ప్రస్తుతం  ఎలా గాంధీ  ఫీనిక్స్‌ సెటిల్‌మెంట్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.

మన విశ్వాసాలు, మత గ్రంథాలు తమను మంచి మార్గంలో నడిచేందుకు, ప్రజలపై దయ, ప్రేమ వ్యక్తం చేసేందుకు రూపొందించారని అన్నారు. వాస్తవాలను బహిరంగంగా వెల్లడించడం చాలా ముఖ్యమని, తద్వారా ప్రస్తుతం జరుగుతున్న దుశ్చర్యలను అరికట్టవచ్చని ఎలా పోస్ట్‌ చేసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో హిందూ ప్రార్థనలను పఠించాలని పలువురు హిందూ నేతలను ఆహ్వానించానని, కానీ వారు ఆహ్వానాన్ని తిరస్కరించారని అన్నారు. 120 సంవత్సరాలలో ఉద్దేశపూర్వకంగా ఓ కమ్యూనిటీని  విడిచిపెట్టారని  ఎప్పుడూ నిందించలేదని అన్నారు.

➡️