52 ఏళ్ల తర్వాత చంద్రునిపై మొదటి అమెరికా ప్రైవేటు ల్యాండర్‌

కేప్‌ కెనవెరాల్‌ :   52 ఏళ్ల తర్వాత అమెరికాకి చెందిన మొదటి ప్రైవేట్‌ ల్యాండర్‌ గురువారం చంద్రునిపై దిగింది. అయితే ల్యాండర్‌ నుండి వచ్చే సిగల్స్‌ బలహీనంగా ఉన్నాయని ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ (ఐఎం) తెలిపింది. దక్షిణ ధ్రువానికి 300 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్‌ను దింపాలని ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. వారం రోజుల పాటు పనిచేసేలా ఈ ల్యాండర్‌ను రూపొందించారు. దీంతో చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ని ప్రయోగించిన మొదటి ప్రైవేటు కంపెనీగా ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ నిలిచింది.

స్పాటి కమ్యూనికేన్‌ ఉన్నప్పటికీ.. క్రాఫ్ట్‌ను నిర్వహించే సంస్థ ఇంట్యూటివ్‌ మిషన్‌ గతవారం ప్రయోగించిన ల్యాండర్‌ చంద్రునిపై దిగినట్లు ధ్రువీకరించింది. అయితే ల్యాండర్‌ ప్రస్తుత పరిస్థితి, ఖచ్చితమైన స్థానం గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ల్యాండింగ్‌ను నిర్థారించిన వెంటనే కంపెనీ ప్రత్యక్ష ప్రసార వెబ్‌కాస్ట్‌ను నిలిపివేసింది.

ఒడిస్పియస్‌ అని పిలిచే ఈ ల్యాండర్‌ ల్యాండ్‌ అయిన తర్వాత కంపెనీకి చెందిన హ్యూస్టన్‌ కమాండ్‌ సెంటర్‌లో గందరగోళం ఏర్పడిందని మిషన్‌ డైరెక్టర్‌ క్రెయిన్‌ తెలిపారు. కంట్రోలర్‌లు సుమారు 25,000 మైళ్ల (4,00,000 కి.మీ) దూరంలో ఉన్న అంతరిక్ష నౌక నుండి సిగల్‌ కోసం వేచి చూస్తున్నారని అన్నారు. 15 నిమిషాల తర్వాత ల్యాండర్‌ నుండి బలహీనమైన సంకేతాలు అందాయని అన్నారు. సిగల్స్‌ను ఎలా మెరుగుపరచాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఈ ప్రయోగం కోసం ఇంట్యూటివ్‌కు నాసా 118 మిలియన్‌ డాలర్ల నిధులను సమకూర్చినట్లు పేర్కొన్నారు. రోదసీ యాత్రలను వాణిజ్యీకరించడంలో భాగంగా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపారు. 1972లో అపోలో మిషన్‌ తర్వాత నాసా చేపట్టిన ల్యాండింగ్‌ ఇదేనని పేర్కొన్నారు. గత నెలలో ఆస్ట్రోబోటిక్‌ ప్రయోగాన్ని చేపట్టినప్పటికీ.. అది విఫలమైన సంగతి తెలిసిందే.

➡️