గాజాలో పౌరుల మరణాలు సహించరానివి !

  • ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో భారత రాయబారి రుచిరా కాంభోజ్‌
  • ఒకే రోజు 147మంది పాలస్తీనియన్లు మృతి
  • సురక్షిత జోన్‌లనూ విడిచిపెట్టని ఇజ్రాయిల్‌ బలగాలు
  • అబ్బాస్‌తో బ్లింకెన్‌ భేటీ

ఐక్యరాజ్య సమితి : గాజాలో పౌరుల మరణాలు సహించరానివని ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో భారత శాశ్వత రాయబారి రుచిరా కాంభోజ్‌ అన్నారు. గాజాపై ఇజ్రాయిల్‌ యుద్ధం ఆరంభించినప్పటి నుండి ఇజ్రాయిల్‌, పాలస్తీనా నేతలతో భారత్‌ నిరంతరంగా సంబంధాలను కలిగివుందని చెప్పారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని భారత్‌ కోరుతూ వస్తోందన్నారు. మానవతా సాయం నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని, శాంతి, సుస్థిరతలు త్వరగా పునరుద్ధరించాలన్నది భారత్‌ వైఖరని స్పష్టం చేశారు.

గాజాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న భీకర దాడుల్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతోందని, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని రుచిరా కాంభోజ్‌ బుధవారం పేర్కొన్నారు. దాడుల ఫలితంగా మానవతా సంక్షోభం నెలకొందన్నారు. ఇది ఎంత మాత్రమూ సహించరానిది, ఆమోదించరానిదని అన్నారు. పౌరుల మరణాలను భారత్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తీవ్రవాదం ఏ రూపంలో, ఎలా వున్నా భారత్‌ ఎన్నడూ సహించబోదన్నారు. పౌరులను బందీలుగా చేపట్టడం సమర్ధనీయం కాదన్నారు. తక్షణమే బందీలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

మధ్య ప్రాచ్యంలోని నేతలతో భారత నాయకత్వం సంబంధాలను కలిగివుందని చెబుతూ, చర్చలు, దౌత్య మార్గం ద్వారా ఈ ఘర్షణలకు శాశ్వత, శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలన్నదే భారత్‌ వైఖరని, తాము మొదట నుండి ఇదే చెబుతున్నామని అన్నారు. గాజాలో మానవతా సాయాన్ని అందించడంపై భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి రష్యా సవరణను ప్రతిపాదించగా, అమెరికా గత నెల 22న వీటో చేసింది. అనంతరం జరిగిన జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో రుచిరా కాంభోజ్‌ ప్రసంగించారు.

సెంట్రల్‌, దక్షిణ గాజాల్లో ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న ముమ్మర దాడుల్లో మంగళవారం నాడు 147మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో రఫా నగరంలోని ఒకే కుటుంబానికి చెందిన 15మంది కూడా వున్నారు. ఒకప్పుడు సురక్షిత జోన్‌ అని ప్రకటించిన రఫా నగరంలో కూడా ఇజ్రాయిల్‌ భీకరంగా దాడులకు దిగుతోంది. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో ఇజ్రాయిల్‌ బలగాలు వరుస దాడులు చేపడుతున్నాయి. పేలుడు పదార్దాలతో పాలస్తీనా ఫైటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇదిలావుండగా, రమల్లా నగరంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంపై అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గాజాలో పౌరులకు జరుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై బ్లింకెన్‌ చర్చించారని, అలాగే మానవతా సాయాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా అందచేయడం కూడా వేగంగా సాగాలని కోరినట్లు ఆ ప్రకటన పేర్కొంది. రెండు దేశాల ఏర్పాటు దిశగా స్పష్టమైన చర్యలు తీసుకోవడానికి అమెరికా మద్దతిస్తుందని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ చెప్పారు. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాడుల్లో 23,357మంది మరణించగా, 59,410మంది గాయపడ్డారు.

సెంట్రల్‌ గాజాలోని డేర్‌ ఎల్‌ బాలాV్‌ాలో అల్‌ అక్సా ఆస్పత్రికి సమీపంలోని ఇంటిపై ఇజ్రాయిల్‌ బలగాలు దాడి చేయడం 40మందికి పైగా మరణించారు, పలువురు గాయపడ్డారని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సెంట్రల్‌ గాజాలో ఇజ్రాయిల్‌ ఆర్మీ సురక్షిత ప్రాంతమని ప్రకటించిన చోటే జరిగిన ఈ భీకర దాడితో వారు చెబుతున్న అసత్యాలు, చేస్తున్న మోసాలు తేటతెల్లమవుతున్నాయని మీడియా కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. గాజాలో ఎక్కడా కూడా సురక్షితమైన ప్రాంతమనేదే లేదని దీంతో స్పష్టమైందని పేర్కొంది.

గాజాలో ఇళ్ళను విధ్వంసం చేయడాన్ని ఊచకోతకు సాక్ష్యాధారాలుగా అంతర్జాతీయ న్యాయస్థానం పరిగణించాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణుడు బాలకృష్ణన్‌ రాజగోపాల్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు గాజాలో 56శాతానికి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఉత్తర గాజాలో పరిస్థితి మరీ దారుణంగా వుందన్నారు. 82శాతం గృహాలు నేలమట్టమయ్యాయన్నారు. గాజాలో ఆస్పత్రుల్లో పరిస్థితి చాలా దారుణంగా వుందని రెడ్‌ క్రాస్‌ తెలిపింది. అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ కమిటీ డైరెక్టర్‌ రాబర్ట్‌ మార్దిని మాట్లాడుతూ, అన్ని ఆస్పత్రుల్లోనూ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందన్నారు. ఇది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కానిదని, ప్రమాదకరమైనదని వ్యాఖ్యానించారు.

➡️