Israel army: ఖాన్‌ యూనిస్‌ను ఖాళీ చేయండి

గాజా  :   దక్షిణ గాజాలోని రెండవ అతిపెద్ద నగరమైన ఖాన్‌ యూనిస్‌పై ఇజ్రాయిల్‌ దాడిని ప్రారంభించింది. తాజాగా నగరాన్ని ఖాళీ చేయాల్సిందిగా ప్రజలను ఆదేశించింది. ఇజ్రాయిల్‌ దాడులతో వందలాది మంది పాలస్తీనియన్లు పారిపోయారని, నగరంలోని చాలా ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంగళవారం జరిగిన దాడిలో ఎనిమిది మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడినట్లు పాలస్తీనియన్‌ రెడ్‌ క్రసెంట్‌ సొసైటీ వెల్లడించింది.

సోమవారం పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌ (పిఐజె) గ్రూప్‌ రాకెట్‌ దాడికి ప్రతిస్పందనగా ఈ బాంబు దాడి చేసినట్లు ఇజ్రాయిల్‌ సైన్యం ప్రకటించింది. అక్టోబర్‌ 7 నుండి పిఐజె కూడా హమాస్‌తో కలిసి పోరాడుతున్నట్లు తెలిపింది. ఖాన్‌ యూనిస్‌ ప్రాంతం నుండి 20 క్షిపణులు దాటుతున్నట్లు గుర్తించామని, వాటిలో కొన్నింటిని కూల్చివేశామని తెలిపింది.

రోగులపై తీవ్ర ప్రభావం : వైద్యులు

ఈ ఆదేశాలు రోగులపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు పేర్కొన్నారు. ఆదేశాలతో ఖాన్‌ యూనిస్‌లో వైద్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న చిట్టచివరి ఆస్పత్రి యూరోపియప్‌ గాజా హాస్పిటల్‌ను వైద్యులు ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో రోగులు, ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులైన పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందుల్లో పడేసిందని అనస్తీషియాలజిస్ట్‌ జెర్మీ హికే తెలిపారు. గాయాలు, ఇంధన కొరత, అనుమతి సమస్యలతో వారి తరలింపు భారంగా మారుతుందని అన్నారు.

➡️