జపాన్‌లో 92కి చేరిన భూకంప మృతుల సంఖ్య

Jan 5,2024 13:33 #death toll, #Earthquake, #Japan

టోక్యో :   జపాన్‌లో భూకంప మృతుల సంఖ్య 92కి చేరింది. గల్లంతైన వారి సంఖ్య 242కి చేరిందని అధికారులు శుక్రవారం తెలిపారు. జనవరి 1 నూతన సంవత్సరం రోజున 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అనంతరం వందలాదిగా వచ్చిన ప్రకంపనలకు సుమారు 330 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గురువారం మధ్యాహ్నం వాజిమాలోని వారి నివాసాల శిథిలాల నుండి ఇద్దరు మహిళలను బయటకు తీసినట్లు తెలిపారు. భూకంపం ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో నోటో ద్వీపకల్పంలోని ఓడరేవు నగరమైన వాజిమా కూడా ఒకటి. ప్రకంపనల తీవ్రతకు అగ్ని ప్రమాదం సంభవించడంతో వందలాది ఇళ్లు దగ్థమయ్యాయి. ఇప్పటికీ ఆ ప్రాంతమంతా మసి, పొగ వ్యాపించి ఉన్నాయి.

సుజు ప్రాంతం కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఫిషింగ్‌ బోట్లు మునిగిపోయాయి. సునామీ ధాటికి బోట్లు ఎగిరిపడ్డాయి. ఇషికావా ప్రాంతానికి విద్యుత్తు, నీటి సరఫరా నిలిచిపోయాయి. సుమారు 30,000 గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోగా, రెండు సమీప గ్రామాలు సహా 89,800 గృహాలకు నీటి పంపిణీ నిలిచిపోయింది. వందలాది మంది ప్రభుత్వ వసతి గృహాల్లో ఉన్నారు.

➡️