Kenya president : ఆ మృతులకు ప్రభుత్వాన్ని నిందించొద్దు

నైరోబి :   ఆందోళనకారుల మృతికి ప్రభుత్వాన్ని నిందించవద్దని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో పిడివాదం చేశారు. సోమవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. మరణాలకు తాను కారణం కాదని అన్నారు. ఇది చాలా దురదృష్టకరమని, ప్రజాస్వామ్యంలో అవి తమ సంభాషణలో భాగం కాకూడదని అన్నారు. 19 మంది మృతిపై విచారణ జరుగుతోందని, ప్రతి ఒక్క ఘటనకు వివరణ ఉంటుందని అన్నారు. పోలీసులు తమ శక్తి మేర బాధ్యతలు నిర్వర్తించారని అన్నారు. చట్టాన్ని అతిక్రమించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామన్నారు.

అలాగే పార్లమెంటుపై దాడి చేసిన వారిని కూడా బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. నేరస్థులు పార్లమెంటులోకి చొరబడి అల్లకల్లోలం సృష్టించారని అన్నారు. పార్లమెంట్‌పై, న్యాయవ్యవస్థపై దాడి చేసిన వారికి సంబంధించిన వివరాలను సిసిటివి ఫుటేజీ నుండి సేకరిస్తామని అన్నారు. చాలా మంది పారిపోయారని, అయితే వారిని తప్పకుండా పట్టుకుంటామని అన్నారు.

చివరి నిమిషంలో ఆర్థిక బిల్లు ఉపసంహరణపై స్పందిస్తూ… దాదాపు రెండేళ్లు వెనక్కి వెళ్లామని, ప్రభుత్వం భారీగా రుణం తీసుకోవాల్సివుంటుందని అన్నారు. అయితే బిల్లు విషయంలో ప్రజలకు తగిన వివరణనిచ్చి వుండాల్సిందని అన్నారు. ఆర్థిక బిల్లు దేనికి సంబంధించినదో, ప్రజలకు ఏవిధంగా ఉపకరిస్తుందో వివరించడానికి తనకు అవకాశం ఇస్తే.. ప్రజలు తప్పకుండా తనతో ఏకీభవించేవారని అన్నారు.

1963లో బ్రిటన్‌ నుండి స్వాతంత్య్రం పొందిన తర్వాత మొదటిసారి దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ప్రజలపై పన్నుల భారాన్ని పెంచుతూ తీసుకొచ్చిన ఆర్థిక బిల్లును ఉపసంహరించుకోవాలంటూ ప్రజలు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో సుమారు 30 మంది మరణించారు.
ఆందోళనలో మృతి చెందిన వారి సంస్మరణార్థం వందలాది మంది ప్రజలు శనివారం కెన్యా రాజధాని నైరోబీలో భారీ ప్రదర్శన చేపట్టారు. క్యాండిల్స్‌, జాతీయ జెండాలు చేపట్టి నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో గాయపడిన వారికి చికిత్సనందిస్తున్న ఆస్పత్రి వరకు ప్రజలు మార్చ్‌ చేపట్టారు.

➡️