ట్రంప్‌పై మరో రాష్ట్రం వేటు..

వాషింగ్టన్‌ :    అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై మరో రాష్ట్రం వేటు వేసింది. ‘మైన్‌’ ప్రైమరీ బ్యాలెట్‌ పోరు నుంచి ట్రంప్‌ పేరును తొలగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సెక్రటరీ  (  ప్రధాన ఎన్నికల అధికారి ) గురువారం వెల్లడించారు.  ఓ ఎన్నికల అధికారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరును బ్యాలెట్‌ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.  14వ సవరణలోని సెక్షన్‌ 3 ప్రకారం.. ట్రంప్‌ను పోటీకి అనర్హుడని ప్రకటిస్తూ కొలరాడో సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుని సవాలు చేస్తూ రిపబ్లికన్‌ పార్టీ అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. మైన్‌ రాష్ట్రంలో ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని కొందరు సవాల్‌ చేశారు. వారి అప్పీళ్లను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సెక్రటరీ షెన్నా బెల్లోస్‌.. ట్రంప్‌ పేరును ప్రైమరీ బ్యాలెట్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ ఉత్తర్వులపై ట్రంప్‌ కోర్టుకెళ్లేందుకు అవకాశం కల్పించారు. అప్పటిదాకా ఆదేశాల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అయితే బెల్లోస్‌ నిర్ణయాన్ని మైన్‌ రాష్ట్ర కోర్టులకు అప్పీల్‌ చేయనున్నట్లు ట్రంప్‌ మద్దతుదారులు పేర్కొన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల్లోని ఎన్నికల్లో ట్రంప్‌ పోటీ చేయనున్నారా లేదా అనే అంశంపై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోవడంతో ఆయన మద్దతుదారులు 2021 జనవరి 6న అమెరికా అధ్యక్ష భవనంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని ట్రంప్‌ సమర్థించారని, హింసను ప్రేరేపించారన్న అభియోగాలపై ఇటీవల కొలరాడో కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

➡️