సాయం కోసం ఎదురుచూస్తున్న పాలస్తీనియన్లపై దాడిని ఖండించిన ప్రపంచదేశాలు

Mar 1,2024 15:31 #Israeli troops, #Massacre

గాజా :  పాలస్తీనియన్‌లపై ఇజ్రాయిల్‌ నరమేథం కొనసాగుతోంది. వెస్ట్‌గాజా సిటీలో ఆహారం కోసం ఎదురు చూస్తున్న పాలస్తీనీయులపై ఇజ్రాయిల్‌ కాల్పులు  జరిపింది. ఈ ఘటనలో 112 మంది మరణించగా, 750 మందికి పైగా గాయపడినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఊచకోతని ఖండించింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.

మానవతా సాయం అందిస్తున్న 38 ట్రక్కుల చుట్టూ వేలాది మంది గాజన్‌లు సాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు ఇజ్రాయిల్‌ సైన్యం తెలిపింది. దీంతో డజన్ల కొద్దీ మరణాలు, గాయాలకు దారితీసిందని పేర్కొంది. ముప్పు పొంచి వుండటంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని ఇజ్రాయిల్‌ ఆరోపించింది. ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకోవడం, ప్రజలపై నుండి ట్రక్కులు వెళ్లడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలిపింది.

ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రపంచ దేశాలు 

ఈ ఘటనపై చైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చైనా విదేశాంగ ప్రతినిథి మావో తెలిపారు.

ఈ ఘటన కాల్పుల విరమణ చర్చలను క్లిష్టతరం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు. ఈ మరణాలు భయంకరమైనవని వైట్‌ హౌస్‌ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం పంపించాలని కోరామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ వెల్లడించారు. దర్యాప్తును పర్యవేక్షిస్తుందని, బాధ్యుల నుండి సమాధానం కోరుతున్నట్లు తెలిపారు.

ఈ ఘటన ఘోరమని ఫ్రాన్స్‌ పేర్కొంది. సాయం కోసం ఎదురుచూస్తున్న పాలస్తీనియన్‌లపై ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన కాల్పులు సమర్థనీయం కాదని ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాలస్తీనియన్లు ఆకలి, అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈ విషాదకరమైన ఘటన జరిగిందని అన్నారు. ఇజ్రాయిల్‌ అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని, పౌరులకు సాయం అందించేందుకు రక్షణ కల్పించాలని అన్నారు. పౌరులను ఇజ్రాయెల్‌ సైన్యం లక్ష్యంగా చేసుకుందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ ధ్వజమెత్తారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

మానవత్వానికి వ్యతిరేకంగా మరోనేరమని టర్కీ పేర్కొంది. ”మానవతా సాయం కోసం క్యూలైన్లలో ఎదురుచూస్తున్న అమాయక పౌరులను ఇజ్రాయిల్‌ లక్ష్యంగా చేసుకోవడం, వారిని ఉద్దేశపూర్వకంగా సమిష్టిగా అంతం చేయాలని భావించిందనడానికి నిదర్శనం” అని టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇజ్రాయిల్‌ నుండి ఆయుధాల కొనుగోళ్లను రద్దుచేస్తున్నట్లు కొలంబియా ప్రకటించింది. పాలస్తీనియన్‌లపై మారణహోమాన్ని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఖండించారు. . ”ఆహారం అడిగిన 100 మందికి పైగా పాలస్తీనియన్‌లను ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు నెతన్యాహూ చంపారు. ఇది నరమేథం, మారణహోమం” అని ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ప్రపంచం నెతన్యాహూని అడ్డుకోవాలని అన్నారు.

ఆమోదయోగ్యం కాని ఈ ఘటనను ఖండిస్తున్నట్లు స్పెయిన్‌ ప్రకటించింది.  ఆహారం కోసం ఎదురుచూస్తున్న పౌరుల మృతి కాల్పుల విరమణ ఆవశ్యకతను నొక్కి చెబుతోందని స్పానిష్‌ విదేశాంగ మంత్రి జోస్‌ మాన్యుయెల్‌ ఆల్బరెస్‌ పేర్కొన్నారు.

తక్షణమే కాల్పుల విరమణ కోసం పిలుపునివ్వాలని ఇటలీ డిమాండ్‌ చేసింది.

ఈ ఘటన ఆమోదయోగ్యంకాదని ఐరాస పేర్కొంది. ఇజ్రాయిల్‌ చర్యను ఐరాస అధ్యక్షుడు ఆంటోనియే గుటెర్రస్‌ చర్యను ఖండించారు. పాలస్తీనియన్‌లకు తక్షణమే సాయం అందించాలని ఆయన ప్రతినిధి స్టెఫాన్‌ డుజారిక్‌ తెలిపారు తెలిపారు. గత వారం రోజులుగా సాయం అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖతార్‌, యూరోపియన్‌ యూనియన్‌, సౌదీ, ఆస్ట్రేలియాలు కూడా ఈ ఘటనను ఖండిస్తున్నట్లు ప్రకటించాయి.

➡️