పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ర్యాలీలు

బెత్లెహెం : పాలస్తీనా ప్రజలకు మద్దతుగా, గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ మారణహోమాన్ని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ రాజధానులు, నగరాల్లో శనివారం భారీ ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణహోమంలో ఇప్పటివరకు పిల్లలు, మహిళలు సహా 30,410 మంది ప్రాణాలు కోల్పోయారు. యునైటెడ్ స్టేట్స్, క్యూబా, వెనిజులా, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, ఫ్రాన్స్, నార్వే, జర్మనీ, స్వీడన్, జోర్డాన్, లెబనాన్, తదితర దేశాలు పాలస్తీనా కోసం గ్లోబల్ డే ఆఫ్ యాక్షన్‌ లో భాగంగా గాజాలో వెంటనే కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు.

పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఖండిస్తూ… యునైటెడ్ స్టేట్స్‌లోని అనేక రాష్ట్రాలలో వేలాది మంది కార్యకర్తలు ర్యాలీలలో పాల్గొన్నారు. అనేక సంస్థల పిలుపులకు ప్రతిస్పందిస్తూ, సీటెల్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, సెయింట్ లూయిస్, సాల్ట్ లేక్ సిటీ, వాషింగ్టన్, ణజ, బాల్టిమోర్, బోస్టన్, ప్రొవిడెన్స్, డెట్రాయిట్, వెర్మోంట్, ప్యూర్టో రికో తదితర నగరాల్లో భారీ నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని అత్యవసరంగా నిలిపివేయాలని ప్రదర్శనకారులు నినదించారు.అదనంగా, గాజాలో యుద్ధాన్ని ఆపడానికి తనను తాను త్యాగం చేసిన యుఎస్ వైమానిక దళానికి చెందిన పైలట్ ఆరోన్ బుష్నెల్‌ను గౌరవించటానికి డజన్ల కొద్దీ కార్యకర్తలు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ముందు ఒక సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తలు పాలస్తీనా జెండా కింద కొవ్వొత్తులను వెలిగించి, కొనసాగుతున్న ఇజ్రాయెల్ మారణకాండలను ఖండిస్తూ బ్యానర్లను ఎగురవేశారు.క్యూబాలో, క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ పాల్గొనడంతో పాలస్తీనాకు సంఘీభావంగా రాజధాని హవానాలో భారీ ప్రదర్శన నిర్వహించబడింది.

పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలిపేందుకు దేశంలోని పాలస్తీనా, అరబ్ విద్యార్థులతో పాటు పదివేల మంది క్యూబన్లు భారీ ప్రదర్శనలో పాల్గొన్నారని నివేదికలు తెలిపాయి. వెనిజులా రాజధాని కారకాస్ కూడా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా, గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించింది.

  • ఇదిలావుండగా, గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన గాజాపై దురాక్రమణ ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్‌కు బ్రిటీష్ మద్దతును కొనసాగించడాన్ని నిరసిస్తూ… బ్రిటిష్ రాజధాని లండన్‌లో వేలాది మంది పాలస్తీనా మద్దతుదారులు గుమిగూడారు.
  • యునైటెడ్ కింగ్‌డమ్‌లో, వందలాది మంది ప్రజలు మాంచెస్టర్‌లో కవాతు చేసారు. గాజాలో 5 నెలలుగా ఇజ్రాయెల్ చేసిన మారణహోమం, 75 సంవత్సరాల పాటు పాలస్తీనాలో జాతి నిర్మూలన, హత్యల నుండి ప్రయోజనం పొందుతున్న ఆయుధ కంపెనీలను ప్రస్తావిస్తూ… మీ లాభాలు పాలస్తీనియన్ రక్తంతో తడిసినవి అని నినాదాలు చేశారు.
  • డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా భారీ కవాతు జరిగింది. గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణకు ముగింపు పలకాలని పిలుపునిస్తూ, మారణహోమాన్ని అంతం చేయాలంటూ పాలస్తీనా జెండాలతో నినాదాలు చేశారు.
  • ఫ్రెంచ్ రాజధాని పారిస్‌లో, సెయింట్-అగస్టిన్ స్క్వేర్ ముందు ప్రదర్శనకారులు గుమిగూడారు, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఖండిస్తూ పాలస్తీనా జెండాలను ఊపుతూ, కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పాలస్తీనియన్లకు మద్దతుగా నినాదాలు చేశారు.
  • స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో, పాలస్తీనా మద్దతుదారులు రక్తంతో తడిసిన తెల్లటి ముసుగులతో గుమిగూడారు, పాలస్తీనా ప్రజలకు అంతర్జాతీయ మద్దతు దినోత్సవం సందర్భంగా భూభాగంలో ఆక్రమణ చేసిన మారణహోమాన్ని ఖండిస్తూ నినదించారు.
  • గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి ముగింపు పలకాలని పిలుపునిస్తూ పాలస్తీనా ప్రజల కోసం అంతర్జాతీయ మద్దతు దినోత్సవంఁలో భాగంగా నెదర్లాండ్స్‌లో కూడా చాలా మంది ప్రజలు గుమిగూడారు.
  • జర్మనీలో, పాలస్తీనా జెండాలను ఊపుతూ, గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని ఖండిస్తూ రాజధాని బెర్లిన్ వీధుల్లో జనం కవాతు చేశారు.
  • పాలస్తీనా ప్రజలకు మద్దతుగా, గాజాలో కొనసాగుతున్న దురాక్రమణను ఖండిస్తూ మలేషియా కూడా భారీ ప్రదర్శన నిర్వహించారు.
  • అదేవిధంగా ట్యునీషియాలో గాజా ఆకలితో అలమటిస్తున్నది అనే నినాదంతో దిగ్బంధనం, దురాక్రమణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు ప్రతిఘటన, ప్రతిఘటన.. నో రాజీ, నో చర్చలు అని నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన జరిగింది. అదనంగా, పాలస్తీనాకు సంఘీభావంగా ఈజిప్టు రాజధాని కైరోలోని జర్నలిస్టుల సిండికేట్ భవనం ముందు ఒక సమూహం గుమిగూడింది.
➡️