US: చిల్డ్రన్స్‌ వాటర్‌పార్క్‌లో కాల్పులు .. 8 మందికి గాయాలు

వాషింగ్టన్‌ : అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. మిచిగాన్‌లోని చిల్డ్రన్స్‌ వాటర్‌ పార్క్‌లో శనివారం ఓ దుండగుడు కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 8 మంది గాయపడ్డారు. అనంతరం నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడని ఓక్లాండ్‌ కౌంటీ షెరీఫ్‌ మైఖేల్‌ బకార్డ్‌ తెలిపారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి వుంది.

వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం ఐదుగంటలకు వాటర్‌పార్క్‌కు చేరుకున్న నిందితుడు వాహనం నుండి దిగుతూనే కాల్పులకు దిగాడు. గన్‌ను రీలోడ్‌ చేస్తూ సుమారు 28 సార్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. అనంతరం పార్క్‌ సమీపంలోని నివాసాల వైపు వెళ్లాడని అన్నారు. ఓ నివాసం సమీపంలో కారు పార్క్‌ చేసి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. నివాసం సమీపంలో దాక్కున్నాడని, పోలీసుల కాల్పుల్లో అతను మరణించాడని పోలీసులు తెలిపారు.

కాల్పుల్లో తొమ్మిది, పది మంది దాకా గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. బుల్లెట్‌ గాయాలైన ఎనిమిదేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

అమెరికాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 215 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.

➡️