విజయవంతంగా కక్ష్యలోకి చేరిన దక్షిణ కొరియా రెండో నిఘా ఉపగ్రహం

సియోల్‌ (దక్షిణ కొరియా) : దక్షిణ కొరియా తాజాగా దేశీయంగా తయారుచేసిన రెండో నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోనికి ప్రవేశపెట్టింది. గత సంవత్సరం డిసెంబరులో తొలి సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. అమెరికాలోని వాండెన్‌బర్గ్‌ అంతరిక్ష స్థావరం నుంచి స్పేస్‌ ఎక్స్‌ కంపెనీకి చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా సోమవారం ఈ ప్రయోగం జరిగినట్లు వెల్లడించింది. విజయవంతంగా కక్ష్యలోకి చేరిన ఈ ఉపగ్రహం పనితీరు ఎలా ఉందో అక్కడి నుంచి వస్తున్న సంకేతాల ద్వారా ధ్రువీకరించుకుంటున్నట్లు తెలిపింది.

సైనిక నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా గత నవంబరులో ప్రకటించిన తర్వాత వారం రోజులకే దక్షిణ కొరియా తన ప్రప్రథమ సైనిక గూఢచార ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 2025 వరకు మొత్తం అయిదు ఉపగ్రహాలను పంపాలన్నది ఆ దేశ లక్ష్యం. సియోల్‌ ప్రయోగించిన తొలి ఉపగ్రహం సెంట్రల్‌ ప్యాంగ్యాంగ్‌కు సంబంధించిన స్పష్టమైన చిత్రాలను పంపింది. జూన్‌ నుంచి అది పూర్తిస్థాయి కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఐదు ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరితే ఉత్తర కొరియాలోని ప్రధాన స్థావరాలన్నింటిపై నిఘా వేసే అవకాశం లభిస్తుంది. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆయా ప్రదేశాలకు సంబంధించిన చిత్రాలు అందుతాయని సియోల్‌ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

➡️