ఫాసిస్టు శక్తులపై పిడికిలెత్తిన ఫ్రెంచ్‌ ప్రజానీకం

పారిస్‌లో రెండున్నర లక్షలమందితో కవాతు
దేశవ్యాపితంగా 182 చోట్ల ర్యాలీలు
6లక్షల మందికిపైగా హాజరు
ఏకతాటిపై నిలిచిన వామ పక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, పౌర సమాజం
పారిస్‌: ఫ్రాన్స్‌ రిపబ్లిక్‌కే సవాల్‌గా మారిన పచ్చి మితవాద, జాత్యహంకార శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు పెద్దయెత్తున ఉద్యమించారు. రాజధాని పారిస్‌తో సహా దేశ వ్యాపితంగా శనివారం జరిగిన ర్యాలీల్లో 6,40,000 మంది పాల్గన్నారు. ఒక్క పారిస్‌లోనే రెండున్నర లక్షల మంది పాల్గనడం విశేషం. సిజిటి, సిఎఫ్‌డిటి, యుఎన్‌ఎస్‌ఎ, ఎఫ్‌ఎస్‌యు, యుఎన్‌ఇఎఫ్‌ వంటి ప్రధాన కార్మిక సంఘాలు, ఎస్‌ఒఎస్‌, ఎల్‌డిహెచ్‌ వంటి అసోసియేషన్లు ఇచ్చిన పిలుపునకు అన్ని సెక్షన్ల ప్రజానీకం నుంచి అద్భుతమైన స్పందన లభించింది. పిల్లలు, పెద్దలు, యువకులు, కుటుంబాలకు కుటుంబాలే కదలి వచ్చాయి. వర్షం, దుమ్ము ధూళి వంటి అననుకూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద యెత్తున జనం తరలిరావడం వారిలో చైతన్యానికి దర్పణం పడుతోంది. ర్యాలీలు చాలా వరకు శాంతియుతంగానే జరిగాయి. కొన్ని చోట్ల దుండగుల గుంపు అల్లర్లు సృష్టించడానికి యత్నించినప్పుడు ఘర్షణలు, అరెస్టులు చోటుచేసుకున్నాయి. రెండోరోజు ఆదివారం కూడా ప్రదర్శనలు కొనసాగాయి. పారిస్‌లో జరిగిన ర్యాలీలో పాల్గనేందుకు తాను 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చానని బెల్‌ఫోర్డ్‌కు చెందిన ఫరీద్‌ అనే డ్రైవర్‌ చెప్పాడు. న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ గెలవాలంటే మనమందరం కలసి ఉండాల్సిన అవసరముందని ఆ డ్రైవర్‌ అభిప్రాయ పడ్డాడు. ఈ నిరసనలకు వామపక్ష పార్టీలు, సోషలిస్టులు పౌర సమాజం వీరికి పూర్తి మద్దతు ప్రకటించాయి. ఈనెల 30, వచ్చే నెల 7న రెండు విడతలుగా జరిగే ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల్లో మేరీ లీపెన్స్‌ నేతృత్వంలోని నేషనల్‌ ర్యాలీ, రీకాంక్వెస్ట్‌ వంటి జాతి దురహంకార, పచ్చి మితవాద పార్టీలు విజయం సాధించే అవకాశముందని కొన్ని సర్వేలు సంకేతాలిస్తున్న నేపథ్యంలో ప్రజలు వెల్లువలా వచ్చి ఈ నిరసన ర్యాలీల్లో పాల్గనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ”భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మేమందరం ఏకతాటిపైకి రావడం మేము సాధించిన మొదటి విజయమని” ఎస్‌ఒఎస్‌ రెసిసమ్‌ కార్యకర్త, అయిదో సంవత్సర లా విద్యార్థి ప్రియయనవాల్టి పేర్కొన్నారు. ఆక్స్‌ఫామ్‌ ఫ్రాన్స్‌ అనే ఎన్‌జివో సంస్థ జనరల్‌ డైరక్టర్‌ సెసిల్‌ డప్లో మాట్లాడుతూ, ”ప్రమాదం చాలా పెద్దది. మితవాదులకు వ్యతిరేకంగా వామపక్ష శక్తులు శాయశక్తులా పోరాడాల్సిన అవసరముంది” అని అన్నారు. వామపక్షాలు, సోషలిస్టులు, అందరూ కలసి ఈసారి న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ పేరుతో ఒక కూటమిగా ఏర్పడ్డారు. గత వారం జరిగిన ఇయు పార్లమెంటు ఎన్నికల్లో పచ్చి మితవాది మేరీ లీపెన్‌ పార్టీ 30శాతం ఓట్లు తెచ్చుకుని బలమైన శక్తిగా అవతరించింది. మాక్రాన్‌ నేతృత్వంలోని రినైజాన్స్‌ పార్టీ కన్నా రెండు రెట్లు అధికంగా ఓట్లు పెంచుకుంది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో గనక మితవాదులు గెలిస్తే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఫ్రాన్స్‌లో అధికారం చేజిక్కించుకున్న తొలి పచ్చి మితవాద ప్రభుత్వంగా అది రికార్డుకెక్కుతుంది. ఇప్పటికే దేశంలో జాతి విద్వేషాలను రెచ్చగొడుతూ, రిపబ్లిక్‌ మౌలిక స్పూర్తినే దెబ్బతీసేలా మితవాద పార్టీలు వ్యవహరిస్తున్నాయి.

➡️