అనారోగ్యంతో మళ్లీ ఆసుపత్రిలో చేరిన అమెరికా రక్షణ మంత్రి

Feb 12,2024 13:28 #again, #defense minister, #Hospitalized, #US

వాషింగ్టన్‌ : కొద్దినెలల క్రితం ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారినపడిన అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఆస్టిన్‌ మూత్రాశయ సమస్యతో బాధపడుతున్నారు. డిసెంబరులో ఆస్టిన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అత్యవసర ఆరోగ్య సమస్యతో ఆదివారం వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలిటరీ సెంటర్‌లో చేరారని పెంటగాన్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో తన రక్షణ శాఖ బాధ్యతలను ఆయన డిప్యూటీ మంత్రి కాథ్లీన్‌ హిక్స్‌కు బదిలీ చేశారు.

తరచూ అనారోగ్యం…

ఇటీవల కాలంలో ఆస్టిన్‌ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారినపడిన ఆయనకు సర్జరీ జరిగింది. అనంతరం తీవ్ర నొప్పితో గత జనవరి ఒకటిన మరోసారి వైద్యులను సంప్రదించారు. జనవరి 15 వరకు ఆసుపత్రిలోనే ఉన్నారు. కొద్దిరోజులు ఇంటినుంచే బాధ్యతలు నిర్వర్తించిన ఆయన జనవరి 29న పెంటగాన్‌కు వచ్చారు. తాజాగా బ్లాడర్‌ సమస్య ఎదురైంది.

గోప్యత పాటించడంపై తీవ్ర విమర్శ-29న విచారణ

ఆస్టిన్‌ తన అనారోగ్యంపై గోప్యత పాటించడం రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వ్యవహారంపై సమీక్ష జరపాలని రక్షణ విభాగం ఆదేశించింది. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు తప్పకుండా అధ్యక్షుడికి సమాచారం ఇవ్వాలని అందరు మంత్రులకు వైట్‌హౌస్‌ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. తన ఆరోగ్య పరిస్థితిపై గోప్యత పాటించాలని తాను సిబ్బందికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆస్టిన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ గోప్యతపై బైడెన్‌ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దానిపై ఆస్టిన్‌ మీడియాతో మాట్లాడుతూ … క్షమాపణలు తెలియజేశారు. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 29న ఆయన కాంగ్రెస్‌ విచారణను ఎదుర్కోనున్నారు.

➡️