న్యూఢిల్లీ : ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్లు 2024లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు కలిగిన దేశాలుగా నిలిచాయి. 227 దేశాల జాబితాలో ఈ ఆరు దేశాలు మొదటిస్థానంలో నిలిచాయి. ఈ పాస్‌పోర్ట్‌లతో 194 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ) అందించిన సమాచారం ఆధారంగా ‘హెన్లీ పాస్‌పోర్ట్ సూచీ’ మంగళవారం జాబితాను విడుదల చేసింది. వీసా లేకుండా ప్రయాణించే పర్యాటకుల సంఖ్య 2006లో 58 నుండి 2024 నాటికి 111కి చేరిందని, దాదాపు రెట్టింపు అయిందని హెన్లీ పాస్‌పోర్ట్ సూచీ రూపకర్త క్రిస్టియన్ హెచ్ కైలీన్ తెలిపారు.
గత ఐదేళ్లుగా సింగపూర్, జపాన్‌లు ఈ జాబితాలో మొదటిస్థానంలో నిలుస్తున్నాయి. అయితే ఈ ఏడాది అదనంగా మరో నాలుగు దేశాలు ఆ జాబితాలో చేరాయి. ఫిన్లాండ్, స్వీడన్, దక్షిణ కొరియా పాస్‌పోర్ట్‌లు రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లతో 193 దేశాలకు వీసాలేకుండానే ప్రయాణించే అవకాశం ఉంది. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ పాస్‌పోర్టులు మూడో స్థానంలో నిలవగా, వీటితో 192 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.
ఈ జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ సహా 62 దేశాలకు వీసాలేకుండానే పర్యాటకులు ప్రయాణించవచ్చు. గతేడాది భారత్ 85 స్థానంలో ఉండగా, 59 దేశాలకు మాత్రమే ముందస్తు వీసా లేకుండానే ప్రయాణించేందుకు అనుమతించాయి. ఉజ్బెకిస్థాన్‌తో పాటు పొరుగునే ఉన్న పాకిస్థాన్‌లు 101వ స్థానంలో నిలవగా, ఆఫ్ఘనిస్థాన్ (104 ) చివరి స్థానంలో నిలిచింది.