ఘోర అగ్నిప్రమాదం – ఆరుగురు సజీవదహనం

న్యూఢిల్లీ : ఢిల్లీలోని పితంపురా ప్రాంతంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగి ఆరుగరు సజీవదహనమయ్యారు.

నిన్న రాత్రి సమయంలో పితంపురా ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. రెండు కుటుంబాల సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు మృతి చెందారు. వీరంతా రెండు వేర్వేరు కుటుంబాలకు చెందినవారు. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు మూడో అంతస్తు వరకూ వ్యాపించాయి. ఎనిమిది ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలోకి ప్రవేశించి మృతదేహాలను బయటకు తీశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️