డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌గా బ్రిజ్‌ భూషణ్‌ సన్నిహితుడు..  రెజ్లింగ్‌కి గుడ్ బై :  సాక్షి మాలిక్ 

 న్యూఢిల్లీ   :   రెజ్లర్ల నిరసనలు ఎదుర్కొన్న బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ సన్నిహితుడు సంజయ్  సింగ్‌   రెజ్లర్‌ బాడీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షునిగా సంజయ్  సింగ్‌ గెలుపొందినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు.  రెజ్లర్లు మద్దతుతో కామన్వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతక విజేత అనితా షెరాన్‌ సంజయ్  సింగ్‌కు పోటీగా బరిలోకి దిగారు.   అనితా షెరాన్‌పై సంజయ్  సింగ్‌ 40 ఓట్లతో విజయం సాధించినట్లు తెలిపారు. మహిళా రెజ్లర్లపై బిజెపి ఎంపి, డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బజ్‌రంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌ సహా పలువురు రెజ్లర్లు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.

  •  రెజ్లింగ్‌కి గుడ్ బై :  సాక్షి మాలిక్ 

డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌గా బ్రిజ్‌ భూషణ్‌ సన్నిహితుని గెలుపుపై రెజ్లర్లు స్పందించారు.  మహిళా రెజ్లర్లు వేధింపులను ఎదుర్కొంటూనే ఉంటారని  ఈ ఎన్నికల ఫలితం స్పష్టం చేసిందని ప్రముఖ రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, వినేష్‌ ఫొగట్‌, సాక్షిమాలిక్‌లు పేర్కొన్నారు. ‘‘ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. మాకు  ఏ రాజకీయ  పార్టీతోనూ సంబంధం లేదు.  రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదు.  న్యాయం కోసం పోరాడుతున్నాము, కానీ ఈ రోజు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ సహాయకుడు  డబ్ల్యుఎఫ్‌ఐ  అధ్యక్షుడయ్యాడు ” అని బజరంగ్ పూనియా  ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లింగ్‌ను విడిచిపెట్టనున్నట్లు సాక్షి మాలిక్ ప్రకటించారు.  ఈ ఫెడరేషన్‌కి  ఓ మహిళ అధ్యక్షురాలు కావాలనుకున్నాం. కానీ అది జరగలేదని అన్నారు.   ఈ దేశంలో న్యాయం ఎక్కడ  దొరుకుతుందో  అర్థం కావడం లేదని  వినేష్‌ ఫోగట్‌ విమర్శించారు. తమ కెరీర్‌ అంధకారంలో ఉందని, ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంజయ్  సింగ్‌ గతంలో ఉత్తరప్రదేశ్‌ రెజ్లింగ్‌ సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. డబ్ల్యుఎఫ్‌ఐ చివరి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా, 2019 నుండి జాయింట్‌ సెక్రటరీ గా పనిచేస్తున్నారు. డబ్ల్యుఎఫ్‌ఐ ఉపాధ్యక్ష పదవి రేసులో ఉన్న ప్రస్తుత మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అధ్యక్ష పదవితో పాటు సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, నలుగురు ఉపాధ్యక్షులు, సెక్రటరీ జనరల్‌, కోశాధికారి, ఇద్దరు జాయింట్‌ సెక్రటరీలు, ఐదుగురు కార్యనిర్వాహక సభ్యుల భర్తీకి ఎన్నికలు జరిగాయి.

డబ్ల్యుఎఫ్‌ఐ ఎన్నికల ప్రక్రియ జులైలో ప్రారంభమైంది. అయితే కోర్టు కేసుల కారణంగా ఆలస్యమైంది. దీంతో అంతర్జాతీయ రెజ్లింగ్‌ సంస్థ డబ్ల్యుఎఫ్‌ఐని సస్పెండ్‌ చేసింది. ఎన్నికలపై పంజాబ్‌ మరియు హర్యానా హైకోర్టు విధించిన స్టేను ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఎన్నికలకు లైన్‌ క్లియరైంది.

 

➡️