పరస్పర సోదర భావంతోనే సమానత్వం సాధ్యం – సిజెఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

Mar 9,2024 22:18 #CJI Justice Chandrachud, #speech

జైపూర్‌ : దేశంలో సమానత్వం నెలకొనాలన్నా, కొనసాగాలన్నా ప్రజల మధ్య పరస్పర సోదర భావం నెలకొనడం చాలా అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ ఉద్ఘాటించారు. ‘మన రాజ్యాంగం..మన గౌరవం’ పేరిట బికనీర్‌లో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రచారకార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటుంటే దేశం ఏ రీతిన పురోగతి సాధిస్తుందని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మనం ఒకరినొకరం గౌరవించుకోవాలన్నారు. వ్యక్తి పరువు, ప్రతిష్టలకు మన రాజ్యాంగ రూపకర్తలు అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చారని అన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి హుందాతనం, సోదరభావం వంటి విలువలకు మన రాజ్యాంగం హామీ కల్పించిందన్నారు. జిల్లా కోర్టుల్లో పరిస్థితులను మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సున్నితమైన పరిస్థితులు, కష్టసుఖాలు వంటి వాటికి జిల్లా కోర్టులు ముందుగా స్పందించాలని, ఎందుకంటే న్యాయం కల్పించే దిశగా ఇవే మొదటి అడుగు అని పేర్కొన్నారు. చట్టపరమైన చైతన్యం తీసుకురావడానికి, సేవలందించడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నామని ఆయన తెలిపారు. కొన్నేళ్ళ క్రితం వీడియో కాన్పరెన్స్‌ ద్వారా విచారణ జరిగేదని, నేడు అనేకమంది న్యాయవాదులు ఆ పద్దతిని అనుసరిస్తున్నారని చెప్పారు. న్యాయ స్థానాలిచ్చే తీర్పులను మరిన్ని ప్రాంతీయ భాషల్లో తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేగ్వాల్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️