యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌లో 250 స్టార్టప్‌లు

Mar 14,2024 07:46 #Employment, #jobs, #kerala, #startups

 2029కల్లా 50వేల కొత్త ఉద్యోగాల కల్పన
 ఎవిజిసి-ఎక్స్‌ఆర్‌ విధానాన్ని ఆమోదించిన కేరళ కేబినెట్‌
తిరువనంతపురం : యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌, ఎక్స్‌టెండెడ్‌ రియాల్టీ (ఎవిజిసి-ఎక్స్‌ఆర్‌) విధానాన్ని కేరళ కేబినెట్‌ బుధవారం ఆమోదించింది. ఈ విధానం కింద ఇటువంటి 250 కంపెనీలను నెలకొల్పి, విస్తరించాలన్నది ప్రభుత్వ లక్షంగా వుంది. 2029 నాటికల్లా ఈ రంగంలో కొత్తగా 50వేల ఉద్యోగాలను సృష్టించాలని భావిస్తున్నారు. దీని ద్వారా ఎవిజిసి-ఎక్స్‌ఆర్‌ పరిశ్రమలో భారతదేశ ఎగుమతి ఆదాయాల్లో 10శాతం వాటా రాష్ట్రానికి వుండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రంగంలో అభివృద్ధి సాధించేందుకు కేరళ స్టార్టప్‌ మిషన్‌, కేరళ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌, కేరళ డిజిటల్‌ యూనివర్శిటీ, కేరళ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ, కేరళ టెక్నికల్‌ యూనివర్శిటీ, కేరళ ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌, సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, కేరళ డెవలప్‌మెంట్‌ ఇన్నొవేషన్‌ స్ట్రాటజీ కౌన్సిల్‌, కేరళ నాలెడ్జ్‌ ఎకనామీ మిషన్‌లు సంయుక్తంగా కృషి చేయనున్నాయి. స్టార్టప్‌ మిషన్‌ ప్రారంభిస్తున్న టెక్నాలజీ హబ్‌ను కూడా విస్తరించనున్నారు. ఈ రంగానికి సంబంధించిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ (సిఓఇ)ని కూడా తిరువనంతపురంలో ప్రారంభిస్తారు. నైపుణ్యాల అభివృద్ధికి, కొత్త కొత్త ఆవిష్కరణలు, వినూత్న పరిశోధనలు, అభివృద్ధికి ఈ సెంటర్‌ ఒక చుక్కానిలా వ్యవహరిస్తుంది. ఎవిజిసి-ఎక్స్‌ఆర్‌ ల్యాబ్‌ల డిజిటల్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌కు ఈ సిఓఇ అవసరమైన మౌలిక సదుపాయాలను అందచేస్తుంఇ. మోషన్‌ కేప్చర్‌, 2డి, 3డి యానిమేషన్‌ వంటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ సాంకేతికతలను, హై స్పీడ్‌ రెండరింగ్‌తో పాటూ ఇతర సదుపాయాలను అందచేస్తుంది. కొత్తగా తలెత్తే ధోరణులపై దృష్టి పెడుతూ పరిశ్రమలోని నిపుణులతో భాగస్వామ్యం కలిగి పరిశోధన, అభివృద్ది కార్యకలాపాలు చేపడుతుంది. ఈ రంగంలో పారిశ్రామికాభివృద్ధికి రూ.200కోట్ల నిధులు కేటాయిస్తారు. పరిశోధనకు రూ.50కోట్లను అందచేయనుంది. ఈ రంగంలోని కళాకారులతో సహకార సంస్థలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

➡️