31న ఢిల్లీ ‘ఇండియా’ మెగా ర్యాలీ

Mar 24,2024 22:57 #Delhi, #india rally

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
ఈ నెల 31న ఇండియా ఫోరం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ‘మహా ర్యాలీ’ నిర్వహించనుంది. ప్రతిపక్షాలపై కేంద్రం దాడులకు వ్యతిరేకంగా, కేజ్రీవాల్‌కు మద్దతుగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో ఇండియా ఫోరంలోని భాగస్వామ్య పార్టీల జాతీయ నేతలంతా పాల్గోంటారు. ఆప్‌ మంత్రులు గోపాల్‌ రాయ్, అతిషి, సౌరభ్‌ భరద్వాజ్‌, ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ అరవిందర్‌ సింగ్‌ లవ్లీ, సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాజీవ్‌ కున్వార్‌ వెల్లడించారు. సమావేశంలో ముందుగా ఢిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్ ఆదివారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ప్రధాని మోడీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ‘కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన తీరును దేశ వ్యాప్తంగా రాజ్యాంగాన్ని ప్రేమించే, గౌరవించే వారందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇది కేవలం కేజ్రీవాల్‌ గురించి మాత్రమే కాదు. మొత్తం ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టడానికి మోడీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. అమ్ముడుపోవడానికి, తలవంచడానికి సిద్ధంగా లేని వారిపై కేసులు నమోదు చేసి.. జైళ్లో వేస్తున్నారు. ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి, విస్తరించడానికి రాంలీలా మైదాన్‌లో ర్యాలీ నిర్వహించనున్నాం. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారు రాంలీలా మైదానానికి రావాలని విన్నవిస్తున్నాం’అని అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ర్యాలీ: అతిషి
‘మహా ర్యాలీ’ కేజ్రీవాల్‌ను రక్షించడానికి కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అని ఢిల్లీ మంత్రి అతిషి తెలిపారు. ‘దేశంలో ప్రజాస్వామ్యం అపాయంలో ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. నియంతృత్వాన్ని పారదోలాల్సిన సమయం వచ్చింది.వ్యవస్థలను ప్రధాని మోడీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు’ అని అతిషి మండిపడ్డారు.

రాజకీయాలకు అతీతం : కాంగ్రెస్‌
ఈ నెల 31న జరిగే మహా ర్యాలీ రాజకీయాలకు అతీతం అని ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అరవిందర్‌ సింగ్‌ లవ్లీ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని, పార్టీ ఖాతాలను స్తంభింపచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు వినిపించడానికి ర్యాలీ చేపడుతున్నామని వివరించారు.. ఈ నెల 31న ‘ఇండియా’ బ్లాక్‌కు చెందిన మిత్రపక్షాల నేతలు ఏకతాటిపైకి వస్తారని సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాజీవ్‌ కున్వార్‌ తెలిపారు. ప్రజాస్వామ్యంపై దాడులను తాము సహించబోమని అన్నారు. దీనిపై పోరాడుతామని పేర్కొన్నారు.

➡️