సంక్షేమం, ప్రగతికి పెద్ద పీట

2024-25 సంవత్సరానికి రూ.1,84,327 కోట్లతో కేరళ బడ్జెట్‌

తిరువనంతపురం :    సంక్షేమం, ప్రగతికి పెద్ద పీట వేస్తూ కేరళలో సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్‌లో రూ.1,38,655 కోట్ల ఆదాయం, రూ.1,84,327 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అంటే రాష్ట్ర జిడిపిలో 2.12 శాతం అంటే రూ.27,846 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. ఆర్థిక లోటు రూ.44,529 కోట్లుగా అంచనా వేయబడింది, ఇది జిడిపిలో 3.4 శాతంగా ఉంది. కాగా, ఎస్‌సి, ఎస్‌టిల సమగ్ర అభివద్ధి కోసం వివిధ ప్రాజెక్టులకు నిధులు కేటాయించామని రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ తెలిపారు. షెడ్యూల్డ్‌ కులాల అభివద్ధికి రూ.2976 కోట్లు, షెడ్యూల్డ్‌ తెగల అభివద్ధికి రూ.859 కోట్లు కేటాయించారు. అంబేద్కర్‌ గ్రామీణాభివద్ధికి రూ.50 కోట్లు, మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు రూ.50 కోట్లు కేటాయించారు. పాలక్కాడ్‌ మెడికల్‌ కాలేజీకి రూ. 50 కోట్లు, పోస్ట్‌ మెట్రిక్‌ విద్యార్థులకు పంపిణీ చేయడానికి రూ.150 కోట్లు కేటాయించారు. ఉద్యోగ ఆధారిత నైపుణ్యాభివద్ధి కార్యక్రమాలకు రూ.55 కోట్లు, తరగతి గదుల నిర్మాణానికి రూ.226 కోట్లు కేటాయించారు. షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన భూమిలేని కుటుంబాలకు ఇళ్లు నిర్మించేందుకు స్థలం కొనుగోలుకు రూ.170 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా భూమిలేని 5000 షెడ్యూల్డ్‌ కులాల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. షెడ్యూల్డ్‌ తెగల విద్యార్థులను ప్రోత్సహించడానికి మరియు వారికి సహాయపడే పథకాలకు గత ఏడాది కేటాయించిన రూ. 8.75 కోట్ల నుంచి రూ.9.25 కోట్లకు పెంచారు. షెడ్యూల్డ్‌ తెగలో విద్యను ప్రోత్సహించేందుకు వివిధ పథకాల కోసం రూ.3210 కోట్లు కేటాయించారు. పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం రాష్ట్ర వాటాగా రూ.12 కోట్లు కేటాయించారు.

ప్రవాస కేరళీయుల సంక్షేమానికి ప్రాధాన్యత

బడ్జెట్‌లో ప్రవాస కేరళీయుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ప్రవాసీయుల సుస్థిర జీవనోపాధి పునరావాస పథకం (ఎన్‌డిపిఆర్‌ఇఎం)కు రూ.25 కోట్లు, పునరావాసం, పునరుద్ధరణ సమన్వయ పథకానికి రూ.44 కోట్లు, ఓదార్పు పథకానికి రూ.33 కోట్లు, రూ.12 కోట్లు కేటాయించారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం, గల్ఫ్‌ దేశాలలో జాతీయీకరణ ఫలితంగా కేరళకు తిరిగి వచ్చిన వారి పునరావాసంలో భాగంగా ప్రభుత్వం సుస్థిర జీవనోపాధి పథకంను అమలు చేస్తోంది. తాజాగా ప్రవాసీయుల పునరావాసం, పునరావాస సమన్వయ పథకానికి మరో రూ.44 కోట్లు కేటాయించారు. ఈ ‘సాంత్వాన’ పథకం ప్రవాసీయులకు ఎంతో ఊరటనిస్తుంది. కనీసం రెండేళ్లపాటు విదేశాల్లో పనిచేసి తిరిగి వచ్చిన మలయాళీలకు రూ.50,000 వరకు వైద్య సహాయం, రూ.లక్ష వరకు మరణానంతర ఆర్థిక సహాయం, రూ.15,000 వరకు వివాహ ఆర్థిక సహాయం అందజేస్తారు. ‘కేరళ ది నాన్‌ రెసిడెంట్‌ కేరళీయుల సంక్షేమ బోర్డు’ ద్వారా కూడా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అలాగే, వికలాంగులకు సహాయక పరికరాలను కొనుగోలు చేయడానికి రూ.10,000 వన్‌-టైమ్‌ గ్రాంట్‌గా కూడా ఇవ్వబడుతుంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.33 కోట్లు కేటాయించారు. కేరళ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మంచి సంక్షేమ, అభివృద్ధి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆర్థిక మంత్రి తమను ఆదుకోవడం పట్ల ప్రవాసీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నవ కేరళకు గట్టి అడుగు : విజయన్‌

సంక్షోభాలు, కష్టాలను అధిగమించి నవ కేరళను రూపొందించేందుకు సోమవారం బడ్జెట్‌ గట్టి అడుగు అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. శరవేగంగా ఆధునీకరిస్తున్న కేరళ ముందుకు సాగేందుకు ఈ బడ్జెట్‌ సమగ్ర కార్యక్రమాన్ని సమర్పిస్తున్నట్లు తెలిపారు. ‘కేంద్ర ప్రభుత్వ విద్వేషపూరిత ధోరణి వల్ల రాష్ట్రం కష్టాల్లో ఉన్నా ప్రజలకు అభివృద్ధ్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి లోటు రాకుండా బడ్జెట్‌ లో జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త యుగం యొక్క సవాళ్లను అధిగమించడానికి రాష్ట్రం యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, విభిన్నమైన, వేగవంతమైన పద్ధతులను అనుసరించడానికి బడ్జెట్‌ ప్రయత్నిస్తుంది. రాష్ట్రానికి దక్కాల్సిన వాటిని సాధించేందుకు సంఘటిత కార్యాచరణకు కూడా బడ్జెట్‌ ప్రాధాన్యతనిస్తోంది’ అని విజయన్‌ తెలిపారు.

కేంద్రం ప్రపంచీకరణ విధానాలకు కేరళ బడ్జెట్‌ ప్రత్యామ్నాయం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్‌

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ప్రతిపాదిస్తున్న ప్రపంచీకరణ విధానాలకు కేరళ రాష్ట్ర బడ్జెట్‌ ప్రత్యామ్నాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ అన్ని రంగాల నుండి వైదొలిగి ఆర్థిక, కార్పొరేట్‌ శక్తులకు అవకాశాలు కల్పించే విధానాన్ని ప్రతిపాదించింది. దానికి భిన్నంగా, కేరళ రాష్ట్ర బడ్జెట్‌ విధానం ప్రభుత్వ జోక్యాన్ని నిర్ధారించడం, కొత్త అవకాశాలను చూడడం. మౌలిక సదుపాయాల కల్పన, విజ్ఞాన సమాజ కల్పనకు ప్రాధాన్యత ఇచ్చింది’ అని అన్నారు.

➡️