మత విద్వేషాగ్ని ఆజ్యం పోస్తున్న ‘మెటా’

May 21,2024 23:25

– ముస్లింలపై విద్వేష ప్రసంగాలకు ఆమోదం
– మోడీపై విమర్శనాత్మక ప్రకటనలకు నిరాకరణ
న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్స్‌యాప్‌ గ్రూపు సంస్థ అయిన మెటా ప్రకటనల ఎంపికలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరు వెలుగులోకి వచ్చింది. మెటా అధినేత జుకెర్‌బర్గ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మధ్యన అత్యంత సన్నిహిత సంబంధాలున్న సంగతి విదితమే. ఆ బంధంతోనే దేశంలో ప్రస్తుత సార్వత్రిక సమరంలో అత్యంత కీలకమైన సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఏకపక్షంగా బిజెపికి అనుకూలంగా నడిపేందుకు మెటా ప్రయత్నిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని బిజెపి చేస్తున్న ప్రయత్నాలకు మెటా పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. తద్వారా అగ్నికి ఆజ్యం పోస్తోంది. ముస్లిం మైనారిటీలు, ప్రతిపక్షాలపై దుష్ప్రచారాన్ని సాగించేందుకు కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో రూపొందించిన రాజకీయ ప్రకటనలకు మెటా గ్రీన్‌సిగల్‌ ఇస్తోంది. దేశంలో నివసిస్తున్న ముస్లింలను దూషిస్తూ తయారు చేసిన పలు ప్రకటనలు ఫేస్‌బుక్‌లో దర్శనమిచ్చాయి. ‘ఈ చీడపురుగులను తగలబెట్టండి’, ‘హిందువుల రక్తం చిందుతోంది. ఈ చొరబాటుదారులను తగలబెట్టాలి’ వంటి రెచ్చగొట్టే ప్రకటనలను సైతం ఫేస్‌బుక్‌ ఆమోదించడం గమనార్హం.
హిందూ మతోన్మాద భావజాలంతో ప్రతిపక్ష నేతలపై దుష్ప్రచారం చేయడం, ఇతర సందేశాలు పంపడం వంటివి కూడా ఫేస్‌బుక్‌లో కన్పించాయి. దేశంలో హిందువులు అనే వారు లేకుండా చేయాలని ప్రతిపక్ష నేత ఒకరు చెప్పినట్లు తప్పుడు వార్త ప్రచారంలోకి వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఓ ప్రకటన వచ్చింది. ఆ నేతను ఉరితీయాలంటూ అందులో డిమాండ్‌ చేశారు. ఈ ప్రకటనలో సందేశం పక్కనే పాకిస్తాన్‌ జాతీయ పతాకాన్ని చూపించారు.
ఆ విధానాలు వారికి వర్తించవా?
మోడీకి వ్యతిరేకంగా వచ్చిన ప్రకటన సహా మొత్తం ఐదు రాజకీయ ప్రకటనలను మెటా తిరస్కరించింది. విద్వేష ప్రసంగాలకు సంబంధించి మెటా విధానాలను ఈ ప్రకటనలు ఉల్లంఘించాయని తెలిపింది. అయితే అదే సమయంలో మెటా విధానాలను బాహాటంగా ఉల్లంఘిస్తూ, ముస్లింలను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన 14 ప్రకటనలకు ఆమోదం లభించడం గమనార్హం. బిజెపి కర్నాటక రాష్ట్ర శాఖ షేర్‌ చేసిన యానిమేటెడ్‌ వీడియోను ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసిన తర్వాతే సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’ తొలగించిన సంగతి తెలిసిందే.
నివేదిక ఏం చెప్పింది?
ఇండియా సివిల్‌ వాచ్‌ ఇంటర్నేషనల్‌ (ఐసిడబ్ల్యుఐ), కార్పొరేట్‌ జవాబుదారీ సంస్థ ఎకో సంయుక్తంగా ఓ నివేదికను రూపొందించి మెటా యాడ్‌ లైబ్రరీకి అందజేశాయి. ఈ నెల 8-13 తేదీల మధ్య…అంటే లోక్‌సభ ఎన్నికల మూడవ, నాలుగవ దశల పోలింగ్‌ మధ్య వచ్చిన ప్రకటనలను ఈ సంస్థలు పరిశీలించాయి. ఈ ప్రకటనల్లో ఉన్న ప్రమాదకరమైన రాజకీయ అంశాలను గుర్తించి తొలగించాల్సిందిగా ఆ సంస్థలు కంపెనీ యంత్రాంగాన్ని కోరాయి. దేశంలో జరుగుతున్న విద్వేష ప్రసంగాలు, దుష్ప్రచారాలను ఆధారంగా చేసుకొని ఈ ప్రకటనలను రూపొందించారని నివేదిక ఎత్తిచూపింది. ఆంగ్లం, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ భాషల్లో ఉన్న 22 ప్రకటనలను పరిశోధకులు మెటాకు అందజేశారు. అయితే ఆశ్చర్యకరంగా వాటిలో 14 ప్రకటనలకు 24 గంటల వ్యవధిలోనే మెటా ఆమోదం తెలిపింది. మరో మూడింటిని చిన్న చిన్న ట్వీక్స్‌ ఆమోదించాయి. కాగా ఆ ప్రకటనలు ప్రచురితం కాకుండా పరిశోధకులు వెంటనే వాటిని తొలగించారు. ఆమోదించిన ప్రకటనల్లో ఏఐ సాయంతో వక్రీకరించిన చిత్రాలే ఉన్నాయన్న విషయాన్ని గుర్తించడంలో మెటా విఫలమైందని వారు తేల్చారు.

➡️