ఉత్తరాఖండ్ :ప్రశాంతంగా ఉన్న ఓ ఆసుపత్రిలోకి పోలీసులు వాహనంతో సహా దూసుకువచ్చింది. దీంతో కొద్ది నిమిషాల పాటు ఆస్పత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా సీన్‌ను తలపించే ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా వైద్యురాలిని వేధించాడు. ఆ నిందితుని చర్యను నిరసిస్తూ ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది డీన్ కార్యాలయాన్ని చుట్టుముట్టి, నిరసనలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ఆసుపత్రికి తమ వాహనంలో చేరుకున్నారు. ఈ సమయంలో వారు సినిమా తరహాలో వాహనంతో సహా ఆసుపత్రిలోకి దూసుకువచ్చారు. జీపుకు దారి కల్పించేందుకు రోగుల స్ట్రెచర్లను తొలగించారు. నిందితుడిని అరెస్టు చేశారు. అయితే ఇంతకీ పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు వాహనంతో సహా లోనికి ఎందుకు వచ్చారన్నది తెలియాల్సి ఉంది.