ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఆప్‌

Feb 9,2024 08:12 #AAP MP

న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ‘ఇండియా’ ఫోరమ్‌ ఏర్పాటైంది. అయితే ప్రస్తుతం దేశంలోని ప్రధాన పార్టీలన్నీ భాగస్వాములైన ఈ వేదిక అసలు లక్ష్యం నెరవేరుతుందా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఈ వేదికలోని ప్రధాన పార్టీలన్నీ కూడా.. ఉమ్మడి నిర్ణయాలకి కాకుండా.. వాటికవే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. బీహార్‌ సిఎం నితీష్‌కుమార్‌ ఇచ్చిన షాకే కాకుండా.. సమాజ్‌వాదీ పార్టీ కూడా షాక్‌ ఇచ్చింది. ‘ఇండియా’లో చర్చించకుండానే.. ఎస్పీ తన ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తాజాగా  ‘ఇండియా’లో ప్రధాన పార్టీ అయిన ఆప్‌ అస్సాంలోని మూడు ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. గురువారం ఢిల్లీలో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఆప్‌ ఎంపీ సందీప్‌ పాఠక్‌ వెల్లడించారు. అనంతరం సందీప్‌ పాఠక్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీట్ల సర్దుబాటు విషయమై ఎప్పటినుంచో ‘ఇండియా’లో చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. అభ్యర్థులను ఫైనల్‌ చేసి ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. ‘ఇండియా’ ఫోరమ్‌ నిర్ణయాలు త్వరగా తీసుకోవాలి. మేం ‘ఇండియా’తోనే ఉన్నాం.  ఇండియా మాకు మద్దతు ఇస్తుందని ఆశిస్తు్న్నాం. పాఠక్‌ అన్నారు. కాగా, ఎస్పీ, ఆప్‌ పార్టీలు ఒకపక్క సీట్ల సర్దుబాటు విషయంపై కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతూనే.. మరోపక్క అభ్యర్థులను ప్రకటించడం పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

➡️