ఓట్ల కోసం శ్రీరాముడి దుర్వినియోగం

Feb 6,2024 07:48 #CPM MP, #CPM MP Brittas
  •  రాష్ట్రాలను ఆర్థికంగా కుంగదీస్తోన్న కేంద్రం
  • బిజెపిపై సిపిఎం ఎంపి బ్రిట్టాస్‌ విమర్శలు
  • పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారు? : లోక్‌సభలో ప్రశ్నించిన ఆరిఫ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాష్ట్రాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆర్థికంగా కుంగదీస్తోందని సిపిఎం రాజ్యసభ ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ విమర్శించారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో జాన్‌ బ్రిట్టాస్‌ మాట్లాడారు. దేశాన్ని విభజించి చీకటి మధ్య యుగంలోకి నెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని విమర్శించారు. దీన్ని దేశ ప్రజలు అనుమతించరని అన్నారు. అయోధ్యలో జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుకను మోడీ ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనాల కోసం రాజకీయ కార్యక్రమంగా మార్చిందని విమర్శించారు. ఓట్ల కోసం శ్రీరాముడిని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రపతి ప్రసంగంలో అయోధ్య మూడుసార్లు ప్రస్తావనకు వచ్చింది. రాముడు అందరికీ చెందినవాడు. కరుణకు, సామరస్యానికి, ప్రేమకు ప్రతీక అయిన గాంధీజీ, రాముడు అందరివారు. కానీ మీరు దాన్ని విస్మరించారు. అయోధ్య వేడుకను బహిష్కరించడంపై ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు. శంకరాచార్యులు ఎందుకు బహిష్కరించారు. రాజకీయ నాటకాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు’ అని అన్నారు. ‘మరి వెంటే ఇడి, ఇతరులు వస్తారేమో చూడాలి. బిజెపి సభ్యులంతా సుప్రీంకోర్టు గురించే మాట్లాడుతున్నారు. బాబ్రీ కూల్చివేత చట్టవిరుద్ధమని, నేరపూరిత చర్య అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ విషయాన్ని బిజెపి సభ్యులు మరిచిపోతున్నారు. ప్రధాని అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేయకూడదు. ప్రాణం పోసుకోవాల్సింది ప్రజలే. ఆయన మణిపూర్‌ వెళ్లి అక్కడి ప్రజల కోసం ప్రాణ ప్రతిష్ట చేయాలి. రామ నామాన్ని జపించడం, రావణుడిని అనుసరించడం ద్రోహమని గాంధీ హరిజనంలో రాశారు. రాముడిని మోసం చేయలేరని గాంధీ కూడా రాశారు. శ్రీరాముడిని నిలబెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడమే బిజెపి లక్ష్యం’ అని విమర్శించారు. ‘ఫిబ్రవరి 4 సర్దార్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిన రోజు. పటేల్‌ రాచరికపు అన్ని చిహ్నాలనూ తుడిచిపెట్టాడు. మీరు ఆ పటేల్‌ను తిరస్కరించి పార్లమెంటులో రాజదండం పెట్టారు. ఇప్పుడు సింహాసనం అనుసరిస్తుంది’ అని విమర్శించారు. ‘మోడీ ప్రభుత్వం అన్ని సంస్థలనూ నాశనం చేస్తోంది. పార్లమెంట్‌లో చర్చ లేదు. స్టాండింగ్‌ కమిటీలు సమావేశం కావడం లేదు. బిల్లులు హాట్‌ కేకుల్లా పాస్‌ అవుతున్నాయి. యుపిఎ ప్రభుత్వ హయాంలో జిడిపి వృద్ధి రేటు 6.8 శాతం. మోడీ పదేళ్ల పాలనలో జిడిపి వృద్ధి 5.9 శాతం మాత్రమే. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారనే వాదన కపటమే. నీతి ఆయోగ్‌ లెక్కల్లో తప్పులే ఉన్నాయి. మరి ఆకలి సూచికలో దేశం ఎందుకు వెనుకబడి ఉంది. ఇతర సూచీలు కూడా వెనుకంజలో ఉన్నాయి. ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా కుంగదీస్తోంది. దీనికి నిరసనగా కేరళ ప్రభుత్వం మొత్తం ఢిల్లీలో నిరసనకు దిగనుంది. కర్ణాటకలో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒక విషయంలో నేను హోంమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రభుత్వం కోసం సిఆర్‌పిఎఫ్‌ను మోహరించడంలో.. దీని ద్వారా కేరళ ప్రజలకు గవర్నరు నుంచి రక్షణ లభిస్తుంది’ అని ఎద్దేవా చేశారు.

పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదు : లోక్‌సభలో సిపిఎం ఎంపి ఎఎం ఆరిఫ్‌

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం ఖాళీ వాదనలు తప్ప మరేమీ కాదని సిపిఎం లోక్‌సభ ఎంపి ఎఎం ఆరిఫ్‌ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన పదేళ్లలో ఏడాదికి రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి, పదేళ్లలో కోటి ఉద్యోగాలు కూడా కల్పించలేదని విమర్శించారు. సోమవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సిపిఎం తరపున ఎఎం ఆరిఫ్‌ మాట్లాడారు. ఈ తీర్మానం పట్ల తాను భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని అన్నారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించలేదని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు. రామమందిర నిర్మాణం శతాబ్దాల ఆకాంక్షల నెరవేర్చడంగా ప్రసంగంలో పొందుపరిచిన అంశాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26న భారతదేశ ‘ప్రాణ ప్రతిష్ట’ జరిగిందని నమ్ముతారు. లౌకిక దేశమైన భారత్‌ను పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ మాదిరి మత దేశంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. దేశ స్వాతంత్య్రం కోసం వేలాది మంది ప్రాణత్యాగం చేశారు. వారెవ్వరూ ఇలాంటి మత రాజ్యాన్ని అనుమతించలేదు’ అని పేర్కొన్నారు. సామాన్య ప్రజల ఆకాంక్షలను తీర్చే విజనే ఈ ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. బ్రిటీష్‌ వారు విభజించు పాలించు వలే, ప్రభుత్వం భాష ప్రాతిపదికన విభజిస్తుందని, హిందీని రుద్దుతుందని విమర్శించారు. కీలకమైన బిల్లులను చర్చ లేకుండా ఆమోదిస్తుందని, అందుకు ప్రతిపక్ష సభ్యలను సస్పెండ్‌ చేస్తుందని దుయ్యబట్టారు. ‘ఈ ప్రభుత్వ హయాంలోనే గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ 107వ స్థానం నుంచి 111వ స్థానానికి పడిపోయింది. పదేళ్లలో దేశానికి అన్నదాతలైన వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ‘వెయ్యి కోట్లతో విగ్రహాలు నిర్మిస్తున్నారు కానీ దేశ క్రీడల ఔన్నత్యానికి స్టేడియంలు నిర్మించటం లేదు. కేరళ పట్ల విద్వేషం కారణంగానే రాష్ట్రానికి ఎయిమ్స్‌ను ఇవ్వలేదు’ అని ఆరిఫ్‌ విమర్శించారు.

➡️