మరోసారి ఇడి విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు

kejriwal-appears-in-court-through-video-conferencing-in-excise-policy-case

న్యూఢిల్లీ   :  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) విచారణకు గైర్హాజరు కానున్నారని  ఆప్‌ సోమవారం పేర్కొంది. ఇడి సమన్లు చట్టవిరుద్ధమని, ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉందని తెలిపింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం పాలసీకి కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌ విచారణకు హాజరుకాకపోవడం ఇది ఆరోసారి. ఈ సమన్లపై కోర్టులో కేసు నడుస్తోందని, దీనిపై దర్యాప్తు సంస్థనే న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని ఆప్‌ ఓ ప్రకటనలో తెలిపింది. విచారణ పెండింగ్‌లో ఉండగా ఇడి మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట వ్యతిరేకమని, కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు వేచి చూడాల్సిందేనని వెల్లడించింది.

లిక్కర్‌ స్కాం కేసులో విచారణ నిమిత్తం జారీ చేసిన నోటీసులకు కేజ్రీవాల్‌ సిఎం స్పందించకపోవడంపై ఇడి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం సమన్లు జారీ చేయడంతో గత శనివారం కేజ్రీవాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే, ఆ రోజున విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, తదుపరి విచారణకు హాజరవుతానని సిఎం అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన కోర్టు.. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.

➡️