UP : మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట

  • 116 మంది మృతి

హత్రాస్‌ : ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగిపోయింది. హత్రాస్‌ జిల్లాలోని సికందర్‌ రావు పోలీసు స్టేషన్‌ పరిధిలోని పులారి గ్రామంలో స్థానిక ఆధ్యాత్మిక గురువు గౌరవార్ధం ఏర్పాటు చేసిన సత్సంగ్‌ (ప్రార్ధనా సమావేశం)లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 60 మందికి పైగా మరణించారు. మరో 200 మంది దాకా గాయపడ్డారు. మృతుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. సత్సంగ్‌కు వచ్చిన జనం వెళ్ళిపోవడానికి ఒక్కసారిగా యత్నించడంతో తోపులాట జరిగిందని ఇటా సీనియర్‌ ఎస్‌పి రాజేష్‌ కుమార్‌ తెలిపారు. మృత దేహాలను బస్సుల్లో,ను, టెంపోల్లో ఇటా ఆసుపత్రికి తరలించారు. .సత్సంగ్‌ (ప్రార్థనా శిబిరం) వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడమే దీనికంతటికీ కారణమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుండెలవిసేలా మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రశాంత వాతావారణంలో సాగాల్సిన అధ్యాత్మిక కార్యక్రమం అంతులేని విషాదానికి దారితీయడానికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై హత్రాస్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ ఆశీష్‌కుమార్‌ మాట్లాడుతూ ఇది ప్రయివేటు కార్యక్రమమని, సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ అనుమతించారని చెప్పారు. అధికారులే భద్రతా ఏర్పాట్లు చేశారని, మిగతా ఏర్పాట్లను నిర్వాహకులు చేసుకున్నారని చెప్పారు. ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం ఉన్నతస్థాయి దర్యాప్తు చేస్తుందని చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ విషాదకర ఘటన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రభృతులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ ఘటనపై సిపిఎం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తగుముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇంతటి విషాదం చోటుచేసుకున్నదని, ఇకనైనా తగిన ప్రొటోకాల్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులో సిపిఎం పేర్కొంది. ఇంత ఘోరం జరిగినా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘటనా స్థలిని సందర్శించకపోవడం, సామాజిక మాధ్యమాల ద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆగ్రా అదనపు డిజిపి, అలీగఢ్‌ కమిషనర్‌ నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

➡️