రోడ్డుపై బైఠాయింపు డ్రామా – కేరళ గవర్నరు వికృత పోకడలు !

Jan 28,2024 10:18 #drama, #Governor, #kerala, #road
  • కేంద్రం వత్తాసు
  • జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత

తిరువనంతపురం : కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌లా వ్యవహరిస్తూ జగడాలమారిగా పేరొందిన కేరళ గవర్నరు అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ వికృత పోకడలు అంతకంతకూ శ్రుతిమించుతున్నాయి. కేరళలో శనివారం నాడు ఆయన ప్రవర్తించిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. కేరళ రాష్ట్ర గవర్నరు ఆరీఫ్‌ మహ్మద్‌ ఖాన్‌కు కేంద్ర ప్రభుత్వం సిఆర్‌పిఎఫ్‌ బలగాలతో జడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత కల్పించింది. విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలపడాన్ని సహించలేని గవర్నరు రోడ్డు పక్కన కుర్చీ వేసుకుని గంటసేపు బైఠాయించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తొక్కిపెట్టడం, కేంద్ర ప్రభుత్వ వినాశకర విధానాలకు మద్దతుగా గళాన్ని వినిపించడం, విశ్వవిద్యాలయాలపై పెత్తనం సాగించాలనుకోవడం వంటి చర్యల నేపథ్యంలో ఆరీఫ్‌ పట్ల రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజులుగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దానిలో భాగంగానే విద్యార్థులు నల్ల జెండాలతో ఎదురేగి నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసనలు తెలిపిన వారిని అరెస్టు చేయాలని, కేసులు పెట్టి ఆ కాపీ తెచ్చేదాకా తాను ఇక్కడి నుంచి లేవనంటూ బీష్మించుక్కూర్చొన్నారు. అంతేకాదు నీలామల్‌ ప్రాంతం వద్ద కారు దిగి వారితో విద్యార్థులతో వాగ్వాదానికి దిగారు. శాంతి భద్రతలను పర్యవేక్షించే అధికారులపైనా ఆయన రుసరుసలాడారు. దాడికి పాల్పడే వారిని పోలీసులు ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి విజయన్‌ చర్యలు తీసుకున్నారంటూ నిందలేశారు. అత్యంత నాటకీయంగా రోడ్డు పక్కనే గల టీ దుకాణంలోని కుర్చీని లాక్కుని గంట పాటు అక్కడే కూర్చుండి పోయారు. పోలీసులు వెంటనే ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఆ కాపీ తీసుకువచ్చి ఇచ్చేవరకు అక్కడే వున్నారు. ఖాన్‌ బృందం ఆ కాపీని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఇ మెయిల్‌ చేశారు. ఆ వెనువెంటనే గవర్నర్‌కు, రాజ్‌భవన్‌కు సిఆర్‌పిఎఫ్‌ సిబ్బందితో భద్రతను పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి.

గవర్నర్‌ అనాలోచిత ప్రవర్తన కేరళకే సవాలు : పినరయి విజయన్‌

గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ప్రవర్తన అపరిపక్వంగా ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. గవర్నర్‌ కొంత కాలంగా వ్యవహరిస్తున్న తీరు ఏమీ బాగోలేదు. ఆయనకు ఏమైందో తెలియదు. ఇప్పుడు ఆయన చేస్తున్నది కేరళ మొత్తానికి సవాల్‌ అని ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో అన్నారు. పదవుల్లో ఉన్నవారిపై నిరసనలు రావడం సహజం. ఇలాంటి నిరసనలు జరిగినప్పుడు అధికార స్థానాల్లో ఉన్నవారి వైఖరి ఎలా ఉంటుందన్నదే ముఖ్యం. నిరసనలపై ఈ గవర్నర్‌ వ్యవహరించిన తీరు ముమ్మాటికీ ఆక్షేపణీయం.. సాధారణ భద్రతా చర్యలకు విరుద్ధంగా గవర్నర్‌ ఇప్పుడు వ్యవహరించారు. ఆందోళనకారులను నిలువరించడం పోలీసుల బాధ్యత. గవర్నర్‌ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ను పట్టించుకోకుండా ఉండబోమని ఓ అధికారి చెప్పడం ఇదే తొలిసారి. ప్రస్తుతం సీఆర్పీఎఫ్‌కి భద్రతను అప్పగించారు. రాష్ట్ర అధినేతకు ప్రభుత్వం అత్యుత్తమ భద్రతను కల్పించింది. గవర్నర్‌ భద్రతను కేంద్రానికి అప్పగించడం విచిత్రంగా కనిపిస్తోంది. కేరళలోని కొందరు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులకు కేంద్రం భద్రత కల్పించింది. ఆ జాబితాలోకి గవర్నర్‌ కూడా చేరారు. గవర్నర్‌ కోరుకున్నట్లు సీఆర్పీఎఫ్‌ పనిచేయగలదా? చట్టం అధికారానికి మించినది. గవర్నర్‌ వైఖరి ఏమాత్రం అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి విషయాల్లో విజ్ఞత ప్రదర్శించాలి. ఇప్పటి వరకు గవర్నర్‌ను కోరలేదు. ఉన్నత పదవుల్లో ఉండాల్సిన వారు చూపాల్సిన పరిపక్వత గవర్నర్‌కు లేదు. ఇటువంటి వ్యక్తిని కేరళ ఇప్పటి వరకు చూడలేదు. కేరళకు సవాల్‌ గవర్నరే. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభ సందర్భంగా గవర్నరు వ్యవహరించిన తీరు అవమానకరం. రాజ్యాంగాన్ని కూడా అవమానించడమే. విధాన ప్రకటన ప్రసంగం చదవడానికి సమయం దొరకని గవర్నర్‌ ఒక గంట పాటు రోడ్డుపైనే బైఠాయించారు. చట్టం అన్నిటికంటే ఉన్నత మైనదని గవర్నర్‌తో సహా అందరూ అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు.

➡️