Bengaluru : బెంగళూరు నీటి కష్టాలు.. నెలకు ఐదుసార్లే స్నానం

Mar 13,2024 12:30 #Bengaluru water crisis

బెంగళూరు : వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో బెంగళూరునే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వర్షాలు పడక, బోర్లు ఎండిపోయి.. తాగడానికి నీరు లేక బెంగళూరు నగర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అక్కడ ప్రజలు ప్రతినీటిబొట్టును ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నారు. నగరవాసులు నెలకు కేవలం ఐదుసార్లే స్నానం చేస్తున్నారంటే నీటికష్టాలు ఎంతటి తీవ్రస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గత కొన్ని నెలలుగా బెంగళూరు వాసులు నీటికొరత వల్ల ఎలాంటి ఇబ్బందులనెదుర్కొంటున్నారో వారి మాటల్లోనే..

నగరంలో నీటి కొరత
‘మాకు రోజూ నాలుగు ట్యాంకర్లు అవసరం. ప్రస్తుతం ఒకటి లేదా రెండు ట్యాంకర్లు మాత్రమే వస్తున్నాయి. గత రెండు మూడు నెలలుగా నీటి సమస్యల్ని ఎదుర్కొంటున్నాము’ అని బెంగళూరు శివారు ప్రాంతమైన బాబూసాపాళ్య నివాసితులు చెప్పారు. ‘ప్రస్తుత నీటికష్టాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం నీటి ట్యాంకర్ల రేట్లను పెంచకుండా అదుపులో ఉంచింది. కానీ సమయానికి నీటి ట్యాంకర్లు రావడం లేదు.’ అని మరో నివాసి అన్నారు.
బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మహిళ మీడియాతో మాట్లాడుతూ.. ‘మాకు ఓ పాప ఉంది. ఈ సమయంలో నీరు లేకపోవడం చాలా కష్టంగా ఉంది. ట్యాంకర్లపై ప్రభుత్వం ధరలు తగ్గించింది. కానీ అవి సమయానికి రావడం లేదు. వచ్చినా ఆ నీరు సరిపోవడం లేదు. ఈ నీటి కష్టాలు ఎప్పుడు తీరతాయో? నీరు సమృద్ధిగా మాకెప్పుడు దక్కుతుందో అర్థం కావడంలేదు.’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలు నీటి సమస్యపై దృష్టి పెట్టలేదు. గత 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమూ తాగునీటి కోసం చర్యలు చేపట్టలేదు. అపార్ట్‌మెంట్‌లు, రోడ్లు నిర్మించడంపైనే ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. అందుకే ఇప్పుడు నీటికోసం కిలోమీటర్ల పొడవునా క్యూలో నిలబడాల్సి వస్తోంది’ అని ఓ నగరవాసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెలకు ఐదుసార్లే స్నానం
బెంగళూరుకు రోజుకు 2,600- 2,800 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం అవుతుంది. కానీ ప్రస్తుతం 1,300 మిలియన్‌ లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతుంది. అంటే దాదాపుసగా సగం నీరు మాత్రమే రోజుకు సరఫరా అవుతోంది. దీంతో గత నెలరోజుల్లో తాను ఐదుసార్లు మాత్రమే స్నానం చేశానని ఓ బెంగళూరు నగరవాసి చెప్పారు.

ట్యాంకర్‌కి రెట్టింపు ధర
‘మేము ప్రగతి టౌన్‌షిప్‌లో ఉంటున్నాం. నీటి ట్యాంకర్‌ కోసం గతంలో రూ. 700 నుంచి 800 చెల్లించేవాళ్లం. ఇప్పుడు నీటి ట్యాంకర్‌ ధర రూ. 1,500 నుంచి 2,000వేల దాకా పెరిగింది. నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో వేసవిలో ఇంకెలా ఉంటుందో? సరైన సమయంలో వర్షాలు పడకపోతే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. నగరపాలక సంస్థ ఆన్‌లైన్‌ బుకింగ్‌ని ప్రారంభించింది. కానీ మాకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఒకవేళ ఆన్‌లైన్‌లోన్లో నీటికోసం బుక్‌ చేసుకున్నా.. మాకు సకాలంలో అందుతుందా లేదా అన్నది కూడా సందేహమే.’ అని ఓ వ్యక్తి అన్నారు.
‘నీటి ఎద్దడిని తగ్గించడానికి ప్రభుత్వాలు ట్యాంకర్లను ఏర్పాటు చేయడం, మరిన్ని బోర్లను తవ్వడం ద్వారా సమస్య పరిష్కారం రాదు. నీటి సమస్యను తీర్చడానికి ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికలు వేయాలి. ఆ ప్రణాళికలకు తగ్గట్టుగా ఆచరిస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది’ అని బెంగళూరుకు చెందిన మరో నివాసి మీడియాకు తెలిపారు.

విద్యార్థులు స్కూళ్లకెళితే.. అక్కడ తాగేందుకు నీరు లేకపోవడంతో.. కొన్ని పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. గిన్నెలు కడగడానికి నీటిని ఎక్కువగా వినియోగించాల్సి వస్తుందని చాలామంది బెంగలూరు వాసులు ఫుడ్‌ను బయట నుంచి ఆర్డర్‌ చేసి తెప్పించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఆసుపత్రుల్లో నీటి కొరత మరీ దారుణంగా ఉంది. ‘రీసైక్లింగ్‌ చేసిన నీటితోనే ఉతకడానికి శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్నామని’ బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌ హాస్పిటల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు.

➡️