రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్యం బిజెపికి లేదు : రాహుల్‌ గాంధీ 

ముంబయి : బిజెపిది హడావుడి మాత్రమేనని, రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్యం లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సవరణలకు, అవసరమైన మార్పులకు పార్లమెంటు ఉభయ సభల్లో తమ పార్టీకి మూడోవంతు మెజార్టీ అవసరమని బిజెపి ఎంపి అనంత్‌కుమార్‌ హెగ్డే ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ప్రియాంకగాంధీతో కలిసి ముంబయిలో ‘జోడో న్యారు సంకల్ప్‌ పాదయాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడారు. సత్యం, ప్రజల మద్దతు తమవైపే ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం జరుగుతోన్న యుద్ధం బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య మాత్రమే కాదని, రెండు సిద్ధాంతాల మధ్య పోటీ నెలకొందని అన్నారు. అధికారం మొత్తం ఒకే దగ్గర ఉండాలని ఆ పార్టీ కోరుకుంటోందని, అధికార వికేంద్రీకరణ జరగాలని, ప్రజల గొంతుకను వినిపించాలని తాము భావిస్తున్నామని తెలిపారు. జ్ఞానం ఒకరి దగ్గరే ఉంటుందని, రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువతకు జ్ఞానం ఉండదని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు భావిస్తున్నాయని విమర్శించారు. ఓ వ్యక్తి ఐఐటి డిగ్రీ పొందినంత మాత్రాన అతను రైతు కంటే ఎక్కువ తెలివైనవాడని కాదని రాహుల్‌ గాంధీ అన్నారు. జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభించిన భారత్‌ జోడో న్యారు యాత్రను 63వ రోజైన శనివారం సాయంత్రం ముంబయిలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్మకం ‘ఛైత్యభూమి’ వద్ద ముగించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌కు నివాళులర్పించారు. రాజ్యాంగ ప్రవేశికను చదివారు.

➡️