సేంద్రీయ వ్యవసాయంపై చిన్నచూపు

Dec 28,2023 09:16 #Organic Farming
budget organic farming

 

నిధులు ఖర్చు చేయని హర్యానా, గుజరాత్‌

న్యూఢిల్లీ : సేంద్రీయ వ్యవసాయంపై బిజెపి పాలిత రాష్ట్రాలైన హర్యానా, గుజరాత్‌ చిన్నచూపు చూస్తున్నాయి. పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన (పికెవివై) పథకం కింద ఈ రాష్ట్రాలకు గత మూడు సంవత్సరాల కాలంలో అందజేసిన నిధులలో ఒక్క రూపాయిని కూడా సేంద్రియ వ్యవసాయం అభివృద్ధి కోసం ఖర్చు చేయలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్‌ ముండా ఇటీవల పార్లమెంటుకు తెలిపారు. కర్నాటక, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, తెలంగాణ రాష్ట్రాలకు గత మూడు సంవత్సరాల కాలంలో అందించిన నిధులు కూడా ఖర్చు కాలేదు. ఉత్తరాఖండ్‌ మాత్రం నిధుల వ్యయంలో ముందుంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని ఈశాన్య రాష్ట్రాలలో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నామని ముండా తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలలో సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు వేరే పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించే రైతుల ఖాతాలలో నేరుగా నిధులు జమ చేస్తామని, వారికి సేంద్రియ ఎరువులు కూడా అందజేస్తామని అర్జున్‌ ముండా వివరించారు. సేంద్రియ వ్యవసాయానికి భిన్నంగా ఉండే ప్రకృతి వ్యవసాయాన్ని కూడా కేంద్రం ప్రోత్సహిస్తోందని ముండా అన్నారు.

➡️