హక్కుల కార్యకర్త, మాజీ ఐఎఎస్‌ హర్ష మందర్‌ ఇల్లు, కార్యాలయంలో సిబిఐ సోదాలు

Feb 3,2024 11:17 #CBI, #Raids
cbi raids in ias harsha

న్యూఢిల్లీ : ఎఫ్‌సిఆర్‌ఎ ఉల్లంఘన కేసులో మాజీ ఐఎఎస్‌ అధికారి, హక్కుల కార్యకర్త హర్ష మందర్‌ ఇల్లు, కార్యాలయంలో సిబిఐ సోదాలు జరిపింది. సిబిఐ నుంచి వచ్చిన నలుగురు వ్యక్తుల బృందం ఉదయం 8 గంటల నుంచి ఈ దాడులు కొనసాగించింది. ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌లో గల ఆయన ఇల్లు, అధిచినిలోని ఆయన కార్యాలయంలో సిబిఐ దాడులు జరిపింది. దాదాపు మూడు గంటలు సోదాలు జరిపిన సిబిఐ బృందం దాదాపు 11 గంటల ప్రాంతంలో ఆయన ఇల్లు, కార్యాలయాల నుంచి బయటకు వచ్చింది. ఎఫ్‌సిఆర్‌ఎ నిబంధనలను ఉల్లంఘించారంటూ సిఇఎస్‌, ఆక్స్‌ఫామ్‌ ఇండియా, అమన్‌ బిరందారీ ట్రస్ట్‌లపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ లిఖిత పూర్వక ఫిర్యాదుతో విచారణ ప్రారంభించినట్లు సిబిఐ తెలిపింది. దాడుల అనంతరం హర్ష మందర్‌ స్పందించారు. ”నా జీవితం, నా పని మాత్రమే నా ప్రతిస్పందన” అని అన్నారు. 2021, సెప్టెంబర్‌లోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) హర్షమందర్‌ ఇల్లు, కార్యాలయంతో పాటు ఆయన పిల్లలకు చెందిన సెంటర్‌ ఫర్‌ ఈక్విటీ స్టడీస్‌ (సిఇఎస్‌)లో సోదాలు నిర్వహించింది.

➡️